సున్నా వడ్డీ రుణాలపై ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అసెంబ్లీలో చర్చ జరిగింది. చంద్రబాబు అసలు ఏమీ ఇవ్వలేదని జగన్ రెడ్డి వాదించారు. కానీ టీడీపీ వాళ్లు ఒక్క ఏడాదిలో 300 కోట్లు ఇచ్చారని రికార్డులు ప్రదర్శించారు. వెంటనే.. అందరికీ ఇవ్వాలంటే రెండు వేల కోట్లు అవుతుందని మోసం చేశారని జగన్ రెడ్డి మాట మార్చారు. మరి జగన్ రెడ్డి ఎంత ఇస్తున్నారో తెలుసో… దాదాపుగా అసలు ఎవరికీ ఇవ్వడం లేదు. ఒక్క రూల్ పెట్టి 80 శాతం మందిని అనర్హుల్ని చేసి పడేశారు.
ఏటా రైతులకు బ్యాంకులిస్తున్న రుణాలకు, ప్రభుత్వం తన వంతు రీయింబర్స్ చేస్తున్న వడ్డీ రాయితీకి మధ్య అసలు పొంతన కుదరట్లేదు. ఒక వైపు బ్యాంకులిస్తున్న అప్పులు ఏటికేడు పెరుగుతుండగా, ప్రభుత్వం ఇస్తున్న వడ్డీ రాయితీ నిధులు అంతకంతకూ తగ్గుతున్నాయి. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నవారిలో అతికష్టం మీద 10-30 శాతం మందికే సున్నా వడ్డీ అందుతోంది. తతిమ్మా రైతులు మొత్తానికి మొత్తం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. రైతులకు సున్నా వడ్డీ రాకపోవడానికి రైతులదే బాధ్యత అని సర్కారు నెపం మోపుతోంది. సకాలంలో రైతులు బ్యాంకులకు అప్పులు తిరిగి చెల్లించనందున అటు కేంద్రం నుంచి వచ్చే 3 శాతం ఇటు రాష్ట్రం నుంచి అందాల్సిన 4 శాతం వడ్డీ కోల్పోతున్నారని తప్పించుకుంటోంది.
గడువు లోపు చెల్లించాలన్న నిబంధన అన్నదాతలను సున్నా వడ్డీకి దూరం చేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఆ నిబంధన పట్టుకొని వేలాడుతోంది. రైతుల్లో కొంత మందికి స్వల్ప మొత్తంలో వడ్డీ రాయితీ ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. బ్యాంకులిచ్చే అప్పుల్లో 70 శాతం వరకు రూ. లక్ష లోపు రుణాలుంటాయి. వాటిల్లో రైతులు సకాలంలో (ఏడాది లోపు) చెల్లిస్తున్న రుణాలు 30 శాతం లోపే ఉంటున్నాయి. బ్యాంకులు 60 లక్షలకు పైన రైతులకు రూ. లక్ష లోపు రుణాలిస్తుండగా సర్కారు ఇచ్చే సున్నా వడ్డీ పట్టుమని పది లక్షల మందికి కూడా దక్కట్లేదు. రుణాలు తీసుకున్న రైతులందరికీ రెండు సీజన్లూ కలుపుకొని సున్నా వడ్డీ సుమారు రూ.3 వేల కోట్ల వరకు ఇవ్వాలి. కానీ సర్కారు ఇచ్చేది వాటిల్లో ఆరో వంతు కూడా లేదు.