ఓ వైపు కేంద్రాన్ని నిలదీయలేని దైన్యం..! మరో వైపు ప్రాజెక్ట్ కట్టకపోతే రాజకీయంగా ఇబ్బందులు..! అలాగని గతంలో సవాల్ చేసినట్లుగా.. కేంద్రం నిధులు ఇవ్వకపోతే.. రాష్ట్రం కట్టలేదా..?.. అని గుర్తు తెచ్చుకుని డబ్బులు పెట్టలేని పేదరికం..! పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సర్కార్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇవి. వీటికి పరిష్కారంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరికొత్త ఆలోచన చేశారు. అదే పోలవరం ఎత్తు తగ్గింపు. పోలవరం ఎత్తున 41.5 మీటర్లకే పరిమితం చేయాలనేది ఆ ప్లాన్. అక్కడి వరకే నీటిని నిల్వ చేస్తే.. ఎంత మందికి పరిహారం ఇవ్వాల్సి వస్తుందో లెక్కలేస్తే.. ఆ భారం రూ. మూడు వేల కోట్లకు దిగిపోయింది. ఇదేదో బాగుందనుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. దీనికే ఫిక్సయిపోయారు. తన సమీక్షా సమావేశంలో అదే చెప్పారు. అంత వరకూ నీటి నిల్వ చేస్తే.. ఎక్కడెక్కడ ముంపు ఏర్పడుతుందో.. అక్కడ ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్ట్. ప్రధానంగా నీటి కొరతతో అల్లాడిపోయే ఉత్తరాంధ్ర, రాయలసీమకు నీటి తరలింపు ఈ ప్రాజెక్ట్‌తోనే సాధ్యం. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు. ఇంత ఎత్తులో నిర్మిస్తే రికార్డుల ప్రకారం 196 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. కృష్ణాకు వచ్చే నీటితో డెల్టా అవసరాలు తీర్చి.. పోలవరం నీటిని సీమ, ఉత్తరాంధ్రకు పంపేలా.. ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు నిధులు ఇవ్వడంలో కేంద్రం వెనుకడుగు వేస్తోంది. గట్టిగా అడగలేని వైసీపీ ప్రభుత్వం.. ప్రాజెక్ట్ రేంజ్‌ని తగ్గించి పని పూర్తి చేయాలని నిర్ణయించింది. 41.15 మీటర్లకే పరిమితం చేస్తే చాలని అనుకుంటోంది. ముఖ్యమంత్రి సమీక్షలో పరోక్షంగా తేల్చి చెప్పారు. ఎత్తు అలా తగ్గించడం వల్ల 140 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల ఏపీ కరువు కాటకాలు అలాగే కొనసాగుతాయి.
45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం రూ. 23వేల కోట్లవుతుంది. అదే 41.15 మీటర్లకు పరిమితం చేస్తే రూ.3 వేల కోట్లు చాలు. కేంద్రం ఇస్తానంటోంది దీని కన్నా ఎక్కువే కాబట్టి.. ఈ పనులు పూర్తి చేసి.. ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయాలని ఏపీ సర్కార్ అనుకుంటోంది. ప్రస్తుత ప్రభుత్వ ఆలోచన ప్రకారం గ్రావిటీ ద్వారా కూడా నీరు అందదు. కేంద్రంతో ఢి కొట్టి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ఉ్దదేశం లేని ఏపీ సర్కార్.. మొత్తానికే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రాజీ పడబోతోంది.