ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముద్రగడ పద్మనాభం పట్టువిడుపులు ప్రదర్శించడంతో ముద్రగడ దంపతుల నిరాహార దీక్ష సాఫీగా ముగిసిపోయింది. కనుక కాపుల పోరాటం టీ కప్పులో తుఫానులా ప్రస్తుతానికి చల్లారిందని భావించవచ్చును. కానీ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఊహించని ఈ పరిణామాలను జీర్ణించుకోవడం చాలా కష్టమే అవుతుంది. ఎందుకంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనే ఉద్దేశ్యంతో ముద్రగడ పోరాటానికి జగన్ మద్దతు ఇచ్చారు. ముద్రగడ భుజంపై తుపాకి ఉంచి తన శత్రువు చంద్రబాబు నాయుడుని దెబ్బ తీయాలని అనుకొన్నారు. అదే సమయంలో కాపుల పోరాటానికి మద్దతు పలకడం ద్వారా వారిని వైకాపా వైపు ఆకర్షించాలని భావించారు. కానీ తెదేపా ప్రభుత్వం చకచకా పావులు కదిపి ముద్రగడ చేత దీక్ష విరమింపజేసి జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేసింది.
ఒక దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని జగన్ ఆశిస్తే, ఒకేసారి రెండు ఎదురుదెబ్బలు తినవలసి వచ్చింది. కాపులకు రిజర్వేషన్లు కోసం ఉద్యమం మొదలవగానే బీసీలు కూడా గట్టిగా ప్రతిఘటించడం ఖాయమని, అప్పుడు ఒకవైపు కాపులు, మరొకవైపు బీసీల మధ్య చంద్రబాబు నాయుడుని పద్మవ్యూహంలో చిక్కుకోన్నట్లు చిక్కుకుపోతారని జగన్మోహన్ రెడ్డి ఊహిస్తే, కొన్ని షరతులతో ముద్రగడ చేత ప్రభుత్వం దీక్ష విరమింపజేయగలిగింది. అంతే కాదు చంద్రబాబు నాయుడుని ‘అనరాని మాటలు అన్నందుకు’ తిరిగి ముద్రగడ పద్మనాభమే క్షమాపణలు కూడా చెప్పుకొన్నారు.
ముద్రగడ షరతులకు ప్రభుత్వం అంగీకరించింది కనుక కాపులు చల్లబడతారు. తెదేపా పట్ల వారు సానుకూలంగా మారకపోయినా దాని పట్ల వారి ఆగ్రహం చల్లారుతుంది. ముద్రగడ షరతులన్నిటికీ ప్రభుత్వం గుడ్డిగా తలూపేయలేదు కనుక ప్రస్తుతానికి బీసీల నుండి కూడా ఎటువంటి సమస్య ఉండకపోవచ్చును. కానీ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ కక్షలు తీర్చుకోవడం కోసం కాపుల పోరాటానికి మద్దతు ఇచ్చినందుకు, బీసీలు వైకాపాకు దూరం అయ్యే ప్రమాదం ఉంది.
ప్రత్యేక హోదాపై పోరాడి ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి ముద్రగడను ముందున నిలబెట్టి చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేద్దామనుకొంటే, ఆయన హటాత్తుగా పక్కకి తప్పుకొన్నారు. దానితో మళ్ళీ ఇప్పుడు ఈ యుద్దంలో కూడా జగన్ ఓడిపోయినట్లయింది. ఈ యుద్దంలో ముద్రగడ విజయం సాధించారు. ఈ సమస్యని తాత్కాలికంగా అయినా పరిష్కరించి ప్రభుత్వం కూడా విజయం సాధించింది. కానీ వెనుక నుండి పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. పాపం…జగన్! అని అనుకోక తప్పదు.