ఎట్టకేలకు మోడీ దేశమంతా అభినందించే నిర్ణయాన్ని తీసుకున్నారు . 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కేంద్రం ఖర్చు తో వ్యాక్సిన్ వేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా రాష్ట్రాలకు 75% వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేయడానికి నిర్ణయించారు. మిగిలిన 25 శాతం మాత్రం ప్రైవేటు ఆసుపత్రులకు ఇచ్చినప్పటికీ , అక్కడ కూడా 150 రూపాయలకు మించకుండా రుసుము వసూలు చేసే విధంగా రూల్స్ తీసుకొచ్చారు. వీటికి తోడు నవంబర్ వరకు పేదలందరికీ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఉచితంగా రేషన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. మోడీ నిర్ణయం పట్ల అన్ని వర్గాల నుండి హర్షం వ్యక్తం అవుతూ ఉండగా, వైఎస్ఆర్సిపి అనుకూల మీడియా మాత్రం జగన్ చేసిన డిమాండ్ వల్లే మోడీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అంటూ ప్రజల్ని మభ్య పెట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
అయితే వైకాపా అనుకూల మీడియా చేస్తున్న ఈ ప్రచారం పాఠకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ముఖ్యంగా డిమాండ్ చేయడానికి , విజ్ఞప్తి చేయడానికి కనీస తేడా కూడా వైకాపా మీడియాకు తెలియడం లేదని పాఠకులు విమర్శిస్తున్నారు. ఏ విషయంలో అయినా కానీ జగన్ మోడీ ని డిమాండ్ చేసే పరిస్థితిలో లేడని, ఏదో సినిమాలో చెప్పినట్లు ” సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం” తో మోడీకి విజ్ఞప్తి చేయగలడే తప్పించి మోడీని డిమాండ్ చేసే పరిస్థితి లో జగన్ లేడని, తన పై ఉన్న కేసులు అలాంటివని అంటూ, మోడీ ఆ మధ్య ఎయిర్పోర్టుకు వచ్చినపుడు జగన్ వంగి వంగి ఆయన కాళ్ళకు దండాలు పెట్టడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. మరి కొందరైతే నిజంగా జగన్ డిమాండ్ చేసే పరిస్థితిలో ఉంటే ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేసి చూడాలని సవాల్ విసురుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన మొదట్లో అసలు ఇది భయపడాల్సిన విషయమే కాదని, బ్లీచింగ్ పౌడర్ , పారాసిటమాల్ ఉంటే సరిపోతుంది అని వ్యాఖ్యానించిన జగన్ కి ప్రధాని ని వ్యాక్సిన్ కోసం డిమాండ్ చేసేంత ముందు చూపు ఉండే అవకాశం లేదని మరి కొందరు అంటున్నారు. ఇంకొందరైతే, జగన్ వ్యాక్సిన్ విషయం లో, కొవిడ్ సమయంలో కేంద్రం రాష్ట్రాలకు చేయాల్సిన సహాయం పై మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం మాట దేవుడెరుగు, కనీసం అలా డిమాండ్ చేసిన హేమంత్ సొరేన్ వంటి జార్ఖండ్ ముఖ్యమంత్రి పై బిజెపి తరఫున వకాల్తా పుచ్చుకుని అలా ప్రశ్నించడం సబబు కాదంటూ ఆయనకు సూక్తులు చెప్పడానికి జగన్ ప్రయత్నించారని గుర్తు చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఆయన కూడా- మీ పై ఉన్న కేసుల కారణంగా మీరు మోడీని ప్రశ్నించలేరు లే, మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను అంటూ సున్నితంగా నే అయినా బలం గానే కౌంటర్ ఇచ్చారు.
నిజానికి వ్యాక్సిన్ ప్రభుత్వం అందరికీ ఉచితంగా ఇస్తే బాగుంటుందని ప్రజలు కూడా అనుకున్నారు. కానీ మోడీని ట్యాగ్ చేస్తూ ఆ విషయంపై మొదట్లో మాట్లాడిన వ్యక్తి పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్. మరి జగన్ డిమాండ్ వల్లే అని వైకాపా అనుకూల మీడియా ఎలా ప్రచారం చేస్తోంది అంటారా? పంజాబ్ ముఖ్యమంత్రి లాగా మోడీని ట్యాగ్ చేసి జగన్ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ కానీ, వినమ్రత పూర్వకమైన విజ్ఞప్తి కానీ చేయకపోయినా, కేరళ సీఎం పినరయి విజయన్ కి ఆ మధ్య జగన్ లేఖ రాశారు. అన్ని రాష్ట్రాలు ఒక్క తాటి పై ఉండి వ్యాక్సిన్ పై ఒకే పాలసీ ఉండేలాగా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని ఆ లేఖ సారాంశం. ఇంకేముంది మోకాలుకీ బోడి గుండు కి లింకు దొరికిన కారణంగా జగన్ డిమాండ్ వల్లే మోడీ దేశం మొత్తానికి ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని తీసుకున్నాడని ప్రచారం ప్రారంభించారు. జగన్ కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి మోడీకి విషయంలో రాసిన ఒకే లేఖలో కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని ఎక్కడా ఆయన కోరలేదు. కేవలం ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ సరఫరా నిలిపి వేయాలని మాత్రమే ఆయన ఆ లేఖలో కోరారు.
అయితే వైకాపా అనుకూల మీడియా చేసిన ఈ ప్రయత్నానికి ఆ పార్టీ వీరాభిమానుల నుండి కూడా సానుకూలత లభించడం లేదు. ఇలాంటి వాటి వల్ల అనవసరంగా జనంలో పలుచన కావడం తప్పించి ప్రయోజనం ఏమీ లేదని ఇలాంటి కథనాలను వండి వార్చక పోవడమే మంచిదని వారు కూడా తమ మీడియాకు సూక్తులు చెప్పడం గమనార్హం.