ఆస్తుల వివాదంలో చేసిన తిక్క పనుల వల్ల ప్రజల్లో తనపై కలుగుతున్న అసహ్యభావాన్ని ఎలా తగ్గించుకోవాలా అని ఇడుపులపాయలో మథనపడుతున్న జగన్ రెడ్డికి ఇతర అంశాలపై ఆలోచించే తీరిక లేదు. కానీ ఆస్తుల వివాదం నుంచి కొత్త టాపిక్ మీదకు ఎలా డైవర్ట్ చేయాలా అని ఆయన మీడియా టీం చాలా ట్రై చేసి చివరికి పోలవరం దగ్గరకు వచ్చింది. పోలవరం ఎత్తు తగ్గించారహో అనే ప్రచారాన్ని ప్రారంభించింది. గతంలో పోలవరం ప్రాజెక్టును ఫేజ్ వన్, ఫేజ్ టు అని చెప్పి… ఎత్తు తగ్గించేందుకు రెడీ అయినట్లుగా ప్రభుత్వమే ప్రకటించింది. పొరుగురాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ కూడా జగన్ తనకు ఎత్తు తగ్గింపుపై హామీ ఇచ్చారని కూడా చెప్పారు. ఇలాంటి చరిత్ర పెట్టుకుని ఇప్పుడు పోలవరం ఎత్తు తగ్గిస్తూంటే ప్రభుత్వం సైలెంట్ గా ఉందంటూ కథ రాసి ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఈ పోలవరం వాదన గురించి జగన్ రెడ్డికి తెలుసో లేదో… ఆయన తరపున సాక్షి మీడియా టీమే ఇదందా చేస్తుందో వాళ్లకే తెలియాలి. కానీ పోలవరం గురించి మాట్లాడితే వైసీపీకే ఎక్కువ నష్టం. ఐదేళ్ల కిందట ఫుల్ స్వింగ్ లో పనుల్ని రివర్స్ టెండరింగ్ పేరుతో ఆపేసి … తీవ్ర నష్టం చేశారు. మధ్యలో పనులు ఆగిపోవడం వల్ల వచ్చిన సమస్యలతో ప్రాజెక్టుకు మొదటికే మోసం వచ్చే పరిస్థితి. ప్రభుత్వం మారిన తరవాతే మళ్లీ కాస్త కదలిక వచ్చింది. పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పుడు మరోసారి పోలవరం అంటూ జగన్ రెడ్డి గ్యాంగ్ బయలుదేరింది. దీనికి టీడీపీ కౌంటర్ ఇచ్చింది.
పోలవరం ప్రాజెక్ట్ 45.72 మీ. ఎత్తు ఉండి తీరుతుంది. అది మా విధానం. చంద్రబాబు గారి విజన్ అయిన నదుల అనుసంధానానికి 45.72 మీ. అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో జగన్ రెడ్డి తన కేసులు కోసం 41.15 మీటర్లకు ఒప్పుకున్నాడు. ఆ ఇబ్బందులు అన్నీ అధిగమించి, 45.72 మీ. పోలవరంలో నీళ్ళు నిలిపి తీరుతామని ప్రకటించారు. అయినా ఓ పనిని పండుకోబెట్టి మళ్లీ దాన్ని లేపి ప్రారంభిస్తున్న సమయంలో మళ్లీ రాళ్లేసేందుకు వస్తున్న వైసీపీ, జగన్ … ప్రజలు ఏమనుకుంటారోనని ఒక్క క్షణం కూడా ఎందుకు ఆలోచించరో మరి !