తాము అధికారంలోకి రావడమే అన్ని సమస్యలకూ పరిష్కారం అన్నట్టుగా హామీ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి. విజయనగరం జిల్లాలోని కోరుకొండలో స్వర్ణకారులతో జగన్ కాసేపు మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. కార్పొరేట్ జువెలరీ షాపుల వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామంటూ కొంతమంది స్వర్ణకారులు జగన్ ముందు సమస్యలు చెప్పుకున్నారు. కార్పొరేట్ దుకాణాలతో స్వర్ణకారులు పోటీలు పడలేకపోతున్నారన్నది నూటికి నూరుపాళ్లు నిజమని జగన్ అన్నారు. కోట్లు ఖర్చుపెట్టి ఆభరణాల తయారీ యంత్రాలను వీరు కొనుగోలు చేసుకోలేరన్నారు. దీంతో ఉపాధి కోల్పోతున్నవారికి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేలు చేస్తుందన్నారు!
మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే… మంగళ సూత్రాలు తయారు చేసే హక్కు చిన్నచిన్న షాపుల మీద ఆధారపడి బతుకుతున్న స్వర్ణకారులకే మాత్రమే ఉండేలా చట్టసభలో తీర్మానం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. దీంతో కార్పొరేట్ షాపులు మంగళ సూత్రాలు అమ్మలేవనీ, కాబట్టి అందరూ చిన్న దుకాణాలకే వచ్చి కొనుగోలు చేయాల్సి వస్తుందని జగన్ చెప్పారు. 11 వస్తువులు చేనేత వృత్తులవారు మాత్రమే తయారు చెయ్యాలని ఏవిధంగా చెప్పారో, అదే తరహాలో మంగళ సూత్రాలు మీరు తప్ప మరొకరు చెయ్యకూడదనే విధంగా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎమ్మెల్సీ సీటు ఇచ్చి, విశ్వబ్రాహ్మణులకు చట్టసభల్లో చోటు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు.
కార్పొరేట్ జువెలరీ సంస్థల వల్ల చిన్న స్వర్ణకారులు ఉపాధి కోల్పోతున్నారు, కచ్చితంగా ఇది సమస్యే. అయితే, కేవలం మంగళ సూత్రాలు తయారు చేసే హక్కు వీరికి కల్పిస్తే సరిపోతుందా..? దాంతో సమస్యలు తీరిపోతాయా..? సగటున ఒక్కో స్వర్ణకారుడూ ఏడాదిలో ఎన్ని మంగళ సూత్రాలు తయారు చెయ్యగలడు..? ఆ ఒక్కటీ తయారు చేసినంత మాత్రాన ఉపాధి సరిపోదు కదా! వీరి సమస్యకి ప్రాక్టికల్ పరిష్కారం ఏంటంటే… స్కిల్ డెవలప్మెంట్. కార్పొరేట్ జువెలరీ సంస్థలకు కూడా నైపుణ్యం గల నగల తయారీదారులు కావాలి. అలాగని, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలకు వెళ్లమని కాదు! ఒక నగ తయారీ చేసే బాధ్యతల్ని సబ్ కాంట్రాక్ట్ గా చిన్న తయారీదారులకు కూడా కొన్ని సంస్థలు ఇస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది అలా ఉపాధి పొందుతున్నారు కూడా. ఈ విషయం జగన్ కు తెలుసోలేదో తెలీదు..! కాబట్టి, వారికి కావాల్సింది నైపుణ్యాల శిక్షణ. అంతేతప్ప, కొన్ని నగల్ని వీరే తయారు చెయ్యాలని చట్టం తెస్తామంటే… అది ఆచరణ సాధ్యమా అనేది అనుమానం.
కార్పొరేట్ సంస్థలతో పోటీ పడాలన్న కాన్సెప్ట్ వారిలోకి ఇంజెక్ట్ చేసే బదులు… వారికి ధీటైన నైపుణ్యాలను పెంచే దిశగా ఒక నాయకుడి ఆలోచనా విధానం ఉండాలి. ఒక సమస్యకు పరిష్కారం మరొకర్ని అధిగమించడమో, లేదా ఇంకొకర్ని తగ్గించడమో కాదు కదా! ఏ రంగంలోనైనా మార్పు అనివార్యం. దానికి అనుగుణంగా నైపుణ్యాలను పదునుపెట్టుకునే అవకాశం యువతకు కల్పించడమే ఒక విజనరీ నాయకుడికి ఉండాల్సిన లక్షణం.