మన గ్యాస్ దోచుకుపోతున్నారని.. రిలయన్స్‌ను వదిలి పెట్టేదే లేదని.. మన గ్యాస్ కాపాడటానికి ప్రయత్నించినందుకే.. వైఎస్‌కు ప్రమాదం జరిగిందని.. గత పదేళ్ల కాలంలో చాలా సందర్భాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆయన మీడియాలో పుంఖానుపుంఖాలుగా రాశారు. మన గ్యాస్ మనకేనని ఆయన నినదించారు. కేజీ బేసిన్ ఎవడబ్బసొత్తు కాదని.. ఉద్యమించారు. ఇలా అనడానికి ప్రధాన కారణం రిలయన్స్ ఇండస్ట్రీసే. కేజీ బేసిన్లో రిలయన్స్ పెట్రోలియం వెలికితీత పనులు చేస్తోంది. అప్పనంగా తరలించుకు పోతున్నారన్న ఆరోపణల్ని వైసీపీ చేసింది. దానికి చంద్రబాబు, రామోజీరావు లాంటి వారికి ముడిపెట్టి కూడా.. కథనాలు ప్రచురించింది.. తాను నమ్మిన ఆధారాలను కూడా ప్రచురించింది.
ఇప్పుడు..జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. నేరుగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీనే ఆయనతో భేటీ కోసం.. తాడేపల్లి వచ్చారు. భేటీ అయ్యారు. అత్యంత గౌరవంగా.. వెండి జ్ఞాపికలు, శాలువాలతో సత్కరించి చర్చలు జరిపారు. అతిధికి ఆ మాత్రం సత్కరింపులు సహజమే. అందులోనూ.. దేశంలోనే అత్యంత ధనవంతుడు.. ప్రపంచ ధనవంతుల్లో ఒకరు అయిన వ్యక్తికి.. చాలా సహజమే. అయితే.. ఇక్కడ ముఖ్యమంత్రి.. గతంలో తాను చెప్పిన విధానాలకు కట్టుబడి… మన గ్యాస్ మన కోసం.. వాదన వినిపించారా లేదా.. అన్నదే కీలకం. కేజీ బేసిన్ సంపద మొత్తం రాష్ట్రానికే దక్కాలన్న ఆయన డిమాండ్‌ను.. రిలయన్స్‌కు వినిపించారా లేదా అన్నదే ముఖ్యం.
పైగా.. కేజీ బేసిన్‌ను.. చంద్రబాబు, రామోజీరావు అమ్ముకున్నారని.. గతంలో.. ఆయన ఆరోపించారు. తన మీడియాలోనూ రాయించారు . ఇప్పుడు ఆ ఒప్పందాలను బయటపెట్టే గొప్ప అవకాశం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ప్రజాసంపదనను అడ్డగోలుగా అమ్మేసిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిని బయట పెట్టే అవకాశం వచ్చింది. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తన పాత విధానాలకే కట్టుబడతారా..? లేక.. ప్రపంచ అత్యంత ధనవంతుడని.. సైలెంట్‌గా ఉండిపోతారా..? తాను ప్రవరించిన సూత్రాల ప్రకారం.. రాష్ట్ర ప్రయోజనాలను కాపడతారా..? కేసీ బేసిన్ సంపదను రాష్ట్ర ప్రయోజనాలకు అందించగలరా..? అన్నదే ముఖ్యం. తన తండ్రి మరణం వెనుక అంబానీ ఉన్నాడని.. జగన్ గతంలో ఆరోపించారు. దాని గురించి అడిగారో లేదో.. మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఆయన తండ్రి కాబట్టి.. తండ్రిని చంపారని గట్టిగా నమ్మిన వాళ్లు ఎదురొస్తే.. ఎలా వ్యవహరిస్తారని ఆయన ఇష్టం. కానీ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం. పట్టించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది.