ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. హోంమంత్రి అమిత్ షాతో దాదాపుగా యాభై నిమిషాల సేపు జగన్ సమావేశమయ్యారు. సమావేశంలో పీఎంవో కీలక అధికారి మిశ్రా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నట్లుగా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తన ఎజెండా ప్రకారం అమరావతి భూములు, ఫైబర్ నెట్ వంటి వాటిపై సీబీఐ విచారణలు కోరినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైనా వినతి పత్రం సమర్పించారు.
వాస్తవానికి నిన్న ఉదయం వరకూ ఢిల్లీ పర్యటన అనే ఆలోచనే లేని.. ముఖ్యమంత్రి సాయంత్రానికి షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. దీంతో ఏదో అర్జంట్ మ్యాటర్ ఉందని అనుకున్నారు. దానికి తగ్గట్లుగానే జగన్ తన పాటు న్యాయనిపుణులను ఢిల్లీ తీసుకెళ్లారు. జగన్ తో పాటు ఢిల్లీ వెళ్లిన వారిలో అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యంశ్రీరాంతో పాటు సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడు భూషణ్ కూడా ఉన్నారు. భూషణ్ కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూంటారు. ఇప్పుడు.. జగన్ కోసం ఆయన కుమారుడు పని చేస్తున్నారు.
అమిత్ షాతో భేటీ సమయంలో… ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. సాయంత్రం ఆరు గంటలకు అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారయినప్పటికీ… ఎనిమిది తర్వాతే భేటీ అయ్యే అవకాశం దొరికింది. దాంతో ఇతర కేంద్రమంత్రుల్ని కలవలేకపోయారు. బుధవారం మధ్యాహ్నం వరకు వివిధ కేంద్రమంత్రుల్ని కలిసి..మధ్యాహ్నం తర్వాత నేరుగా తిరుపతికి వెళ్లే అవకాశం ఉంది.