ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన… ఎన్నికలకు ముందు వైకాపా చేసిన వాగ్దానాల్లో ఇది చాలా ప్రముఖమైంది. పెద్ద సంఖ్యలో ఎంపీలను గెలిపిస్తే, కేంద్ర ప్రభుత్వం నుంచి హోదా సాధించి తీరతామన్నారు. హోదాకి మద్దతు ఇచ్చే ప్రభుత్వానికే కేంద్రంలో మద్దతు ఇస్తామన్నారు. కానీ, ఎన్నికల ఫలితాల అనంతరం…. ఎవ్వరి మద్దతు అవసరం లేకుండా కేంద్రంలో మరోసారి మోడీ సర్కారు కొలువు దీరింది. దీంతో ప్రత్యేక హోదా అంశంపై ఏపీ అధికార పార్టీ వైకాపా కూడా వైఖరి మార్చుకుంది. తాను ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కేంద్రాన్ని హోదా ఇమ్మంటూ కోరుతూనే ఉంటాననీ, ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్తే అన్నిసార్లూ ఇదే తరహా ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటా అన్నారు సీఎం జగన్. అదే అంశాన్ని ఇవాళ్ల మరోసారి స్పష్టం చేశారు.
మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ తరువాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలన్నీ కేంద్ర హోం శాఖ పరిధిలోకి వస్తాయి కాబట్టి హోం మంత్రిని కలిశామన్నారు. ప్రత్యేక హోదా విషయమై ఆయన్ని కూడా రిక్వెస్ట్ చేశామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసు కరిగించేలా మంచి మాటలను చెప్పండి అంటూ అమిత్ షాను కోరామన్నారు జగన్. రేపు జరగబోయే నీతీ ఆయోగ్ లో కూడా ఇవే అంశాలపై తాను మరోసారి మైక్ పట్టుకుని మాట్లాడతా అన్నారు ఏపీ సీఎం. దేవుడి దయతో అది (ప్రత్యేక హోదా) వచ్చే దాకా, ఢిల్లీకి వచ్చిన ప్రతీ సందర్భంలో మరచిపోకుండా ఇలా చూపిస్తూ కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామన్నారు జగన్. ఇలా అడుగూతూ పోతుంటామని మరోసారి స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా ప్రధాని నరేంద్ర మోడీ మనసు బాగున్నప్పుడు తీసుకునే నిర్ణయంగానో, లేదా ఆయనకు మాంచి మూడ్ ఉన్నప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశంగానే ఏపీ ప్రభుత్వం చూస్తున్నట్టుగా ఉంది. ఎన్నికల ముందు ఇదే మోడీ సర్కారుపై హోదా అంశమై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వైకాపా… అధికారంలోకి వచ్చాక కేంద్రంతో సామరస్య పూర్వక వైఖరితోనే ముందుకు సాగుదామని నిర్ణయించుకుంది. అందుకే, ఢిల్లీ వెళ్లినప్పుడల్లా మెల్లగా అడుగుతూ ఉంటామన్నారు సీఎం జగన్. సామరస్యంగా డిమాండ్ చేయడంలోనూ తప్పు లేదు. కానీ, క్రమక్రమంగా ఏపీ హోదా, విభజన హామీలు అమలు అనేవి ప్రధానమంత్రి వ్యక్తిగత వైఖరి బట్టీ తీసుకునే నిర్ణయాలుగా ఏపీ ప్రభుత్వం చూస్తున్నట్టుగా పరిస్థితి మారుతోందని అనిపిస్తోంది. ఒక రాష్ట్ర హక్కులు, కేంద్రం ఇచ్చిన హామీలు అనేవి… కేంద్రంలో అధికార పార్టీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టీ అమలు చేయడం అంటూ ఉండకూడదు కదా!