జెరూసలెం వెళ్లే హడావుడిలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. హైదరాబాద్‌లో బిజీగా గడిపారు. తెలంగాణ గవర్నర్ నరసింహన్‌తో పాటు… సీఎం కేసీఆర్‌ను కూడా ప్రగతి భవన్‌కు వెళ్లి మరీ కలిశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచి హైదరాబాద్‌కు బుధవారమే వచ్చారు. ఒకటో తేదీన ఆయన జెరూసలెం పర్యటనకు వెళ్తారని మీడియాకు సమాచారం ఇచ్చారు. ఎక్కడా.. తెలంగాణ గవర్నర్, తెలంగాణ సీఎంలతో భేటీ అవుతారన్న షెడ్యూల్‌ను లీక్ కానీయలేదు. కానీ.. జగన్మోహన్ రెడ్డి గవర్నర్ దగ్గరకు వెళ్లే ముందు.. మాత్రం మీడియాకు ఈ విషయం తెలిపారు. విభజన సమస్యల పరిష్కారమే ఎజెండాగా.. జగన్ ఇద్దరితో భేటీ అవుతున్నారని చెప్పుకొచ్చారు.
మధ్యాహ్నం సమయంలో.. ప్రగతి భవన్‌కు వచ్చిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి.. కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. వీరి మధ్య ప్రధానంగా విభజన సమస్యలపై చర్చలు జరిగినట్లు… వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో.. ఢిల్లీలో… కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశం కానున్నారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వస్తే.. సమస్యలు అక్కడే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని… ముఖ్యమంత్రులిద్దరూ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్, ఉమ్మడి సంస్ధలు, కరెంట్ బకాయిలు, విద్యుత్ ఉద్యోగుల విభజన సహా.. అనేక అంశాలు రెండు రాష్ట్రాల మధ్య చిక్కుముళ్లుగా ఉన్నాయి. వీటిపై చర్చించినట్లుగా… వైసీపీ వర్గాలు తెలిపాయి. అలాగే.. గోదావరి నీటిని శ్రీశైలానికి మళ్లింపు వ్యవహారంపై..చర్చించినట్లు తెలుస్తోంది.
తెలంగాణంతో.. విభజన సమస్యలపై చర్చించినప్పటికీ.. అంతకు ముందే తెలంగాణ గవర్నర్ నరసింహన్‌తో రాజ్‌భవన్‌కు వెళ్లి మరీ జగన్ భేటీ కావడం.. రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు నరసింహన్ ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ కాదు. ఆయన తెలంగాణకు మాత్రమే గవర్నర్. విభజన సమస్యలపై గతంలో.. ఆయన సమక్షంలో… ఏపీ ఉన్నతాధికారులు చర్చలు జరపాల్సి ఉన్నా… ఏకాభిప్రాయం కుదరని కారణంగా.. వాయిదా వేశారు. అవి మళ్లీ జరగలేదు. ఇటీవల గవర్నర్ తో పలుమార్లు జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఓ సారి ప్రత్యేకంగా జగన్‌ను కలవడానికే.. గవర్నర్ విజయవాడ కూడా వచ్చారు. ఆ తర్వాత వీడ్కోలు సభ నిర్వహించిన సమయంలోనూ.. చాలా సేపు చర్చలు జరిపారు. ఇప్పుడు… జెరూసలెం వెళ్లే హడావుడిలోనూ.. జగన్ గవర్నర్ ను కలవడం రాజకీయవర్గాలను కూడా.. ఆశ్చర్యానికి గురి చేస్తోంది.