ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. ఏ అంశాలపై కలిశారో స్పష్టత లేదు కానీ.. ఆయన సతీమణిని భారతీని తీసుకుని వెళ్లి కలిశారు. రెండు రోజుల కిందట బిశ్వభూషణ్ హరిచందన్ పుట్టిన రోజు జరిగింది. ఆ సందర్భంగా శుభాకాంక్షలను జగన్ సోషల్ మీడియా ద్వారా చెప్పారు. కానీ నేరుగా కలవలేదు. రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్లి మర్యాద పూర్వకంగా కూడా కలవలేదు. తీరిక లేని కారణంగా కలవలేకపోయారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అందుకే ఇవాళ కలిశారని చెబుతున్నాయి.
అయితే… ఇటీవలి కాలంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న అప్పుల విషయంలో గవర్నర్ వ్యవహారశైలిపైనా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. గవర్నర్గా గ్యారంటీర్గా పెట్టి ఎపీఎస్డీసీ రుణాలు తీసుకున్న విషయం పత్రాలతో సహా బయటకు వచ్చింది. అంతకు ముందే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ రూ. నలభై ఒక్క వేల కోట్ల నిధుల లెక్కలు లేకపోవడంపైనా…. అప్పుల అంశంపైనా గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అయితే గవర్నర్ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వచ్చింది.
ఆర్థిక అవకతవకలు.. ఎపీఎస్డీసీ కార్పొరేషన్,… తనఖా రుణాలు ఇలా మొత్తం అన్నింటిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై గవర్నర్కు వివరణ ఇవ్వడానికి జగన్ వెళ్లారని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో జగన్ ఎప్పుడు గవర్నర్ ను కలవడానికి వెళ్లినా.. సతీమణి భారతీని వెంటబెట్టుకుని వెళ్తున్నారు. సతీమణి సమేతంగా వెళ్లడానికి పెద్ద విశేషం ఏమీ లేదని చెబుతున్నారు.