వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తనకు ఇష్టం లేని పనులు వాయిదాలు వేయడానికి ఎన్నికల కోడ్ ను ఓ కారణంగా వాడుకుంటారు. కానీ షో చేయడానికి మాత్రం ఎన్నికల కోడ్ ను కూడా ఉల్లంఘించేందుకు సిద్ధపడతారు. తాజాగా బుధవారం మిర్చియార్డులో రైతుల్ని పరామర్శిస్తారని.. మిర్చిపంటకు ధర పడిపోయిందని వైసీపీ ధర్నా చేయాలని నిర్ణయించుకుంది. దానికి జగన్ హాజరవుతున్నారు.
బెంగళూరులో నాలుగు రోజులు.. తాడేపల్లిలో మూడు రోజులు ఉండే జగన్.. ఈ మూడు రోజులూ ఎవరో ఒకర్ని పిలిపించుకుని మాట్లాడేవారు. ఈ సారి మాత్రం దగ్గరే కదా అని మిర్చియార్డుకు వెళ్లాలనుకున్నారు. కానీ కోడ్ గురించి పట్టించుకోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. రాజకీయ ధర్నాలు, షోలు చేయాలంటే పర్మిషన్ తప్పనిసరి. కానీ అవేమీ తీసుకోకుండా ధర్నాకు వస్తున్నారు. దీంతో అధికారులు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని ప్రచారం చేస్తున్నారు.
ఎన్నికల కోడ్ను అమలు చేయడాన్ని కుట్రగా వైసీపీ చెబుతోంది. మేము ఆ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదు… ప్రచారం చేయట్లేదు.. కనీసం మిర్చి యార్డులో మైకు కూడా వాడట్లేదని.. వైయస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డ్ పర్యటనకు ఎన్నికల కోడ్ వర్తించదని వాదిస్తున్నారు. ఎన్నికల కోడ్ వంక పెట్టి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇబ్బంది పెడితే వాళ్లే ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు. మిర్చి ధర సగానికి సగం పడిపోయింది మిర్చి రైతుల గోడు వినటానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్ వస్తున్నారని…పోలీసులు అడ్డుకోవద్దని అంటున్నారు.
వైసీపీ నేతలు పోలీసుల్ని బెదిరించి.. తమకు అడ్డం లేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఎన్నికల కమిషన్ ఊరుకుంటుందా?