వైకాపాలో చాలారోజులుగా జరుగుతున్న చర్చ… ఆంధ్రాకి జగన్ మకాం మార్పు! వైకాపా మినహా ఇతర పార్టీలన్నీ విజయవాడ ప్రాంతంలో ఆఫీస్‌లు తీసుకున్నాయి. అక్కడి నుంచే ఏపీ పాలిటిక్స్ ఆపరేట్ చేస్తున్నాయి. కానీ, ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా మాత్రం ఇంకా హైదరాబాద్ కేంద్రంగానే ఆంధ్రాలో పనిచేస్తోంది. ఆంధ్రాకి మకాం మార్పుపై జగన్ ఎందుకు తాత్సారం చేస్తున్నారనేది చాలారోజుల నుంచీ నలుగుతున్న అంశం. దీనిపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జగన్. తాను సొంత ఇంటిని నిర్మించుకోవడం వల్ల కాస్త ఆలస్యమౌతోందనీ, చంద్రబాబు అద్దె ఇంట్లో ఉంటున్నారనీ, అధికారం కోల్పోగానే ఆంధ్రా విడిచి వెళ్లిపోతారనే మీనింగ్ వచ్చేలా జగన్ తాజాగా విమర్శించారు.
ఇక్కడే జగన్ కొన్ని లాజిక్స్ మిస్సవుతున్నారు! హైదరాబాద్ నుంచి విజయవాడకు చంద్రబాబు వెళ్లడం వెనక… ఆంధ్రులపై ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారని జగన్ ఇప్పుడు నిరూపిస్తున్నట్టుగా ఉంది. నిజానికి, ఏ రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు హుటాహుటిన విజయవాడకు మకాం మార్చాల్సి వచ్చిందో అందరికీ తెలుసు. ఓటుకు నోటు కేసు వెలుగులోకి రావడం… చంద్రబాబును రక్షించడం దేవుడివల్ల కూడా కాదని తెలంగాణ ముఖ్యమంత్రి అభిప్రాయపడటం… ఇంకోపక్క రేవంత్ రెడ్డి జైలు… ‘మనవాళ్లు బ్రీఫ్ మీ’ అంటూ ఓ ఆడియో టేపు లీకు కలకలం.. ఈ కారణాలే చంద్రబాబును విజయవాడకు పంపాయనే అభిప్రాయం చాలామంది ప్రజల్లో ఉంది. ఈ పాయింట్ జగన్ ప్రస్థావించలేదు..!
ఇంకోటీ… ఉమ్మడి రాజధాని నగరంలో పదేళ్లపాటు ఉండే అవకాశం ఆంధ్రా సర్కారుకు ఉంది. ఆ ఛాన్స్ ఉన్నాసరే, హైదరాబాద్‌లో సర్వహక్కుల్నీ వదిలేసుకునీ, సచివాలయ భవనాన్నీ తెలంగాణకు ఇచ్చేసి, ఉద్యోగుల్ని తత్తరబాటుకు గురిచేసి అమరావతికి రప్పించి, చంద్రబాబు తెగతెంపులు చేసుకున్నారు. ఉమ్మడి రాజధాని నుంచి అధికార పార్టీ పారిపోయినా సరే… ప్రధాన ప్రతిపక్ష నేతగా తాను హైదరాబాద్‌లో ఉంటున్నాననీ, ఇక్కడి సెటిలర్స్‌కు కాస్తోకూస్తో భరోసాగా నిలుస్తూ పదేళ్లపాటు మనకున్న హక్కుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నానని జగన్ చెప్పి ఉంటే మరోలా ఉండేదని పలువురి అభిప్రాయం.
ఈ లాజిక్స్ వదిలేసి మకాం మార్పు విషయంలో సెల్ఫ్‌గోల్ చేసుకునేలా జగన్ మాట్లాడుతున్నారు. చంద్రబాబు ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నా, అది ముఖ్యమంత్రి అధికార నివాసం అవుతుంది కదా… చంద్రబాబు సొంత ఇల్లు కాదు కదా! సొంత ఇల్లు కట్టుకుంటున్నా… అందుకే, ఈ ఆలస్యం అని జగన్ చెప్పుకున్నా.. ఇంటి నిర్మాణానికి మూడేళ్లు చాల్లేదా అనే ప్రశ్న కూడా ఎదురౌతుందిగా! మరి, ఈ పాయింట్‌ను జగన్ ఎలా మిస్ అయ్యారో…!