వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మిధున్‌రెడ్డిని కాపాడుకోవడం అనే సింగిల్పాయింట్ ఎజెండా మీద ప్రస్తుతం ఆ పార్టీ మరియు వారి ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి దినపత్రిక తీవ్రంగా ఆరాటపడుతున్నాయి. ఇది చాలా సహజమైన పరిణామం. ఒక రాజకీయ పార్టీ అనుబంధంతో పత్రిక నడుస్తున్నప్పుడు.. ఆ పార్టీకి చెందిన వారి పట్ల సానుకూలంగా ఉండడం, తాము ప్రతిపక్షంలో ఉండే సమయంలో పాలకపక్షాలు ఏమాత్రం కఠినంగా వ్యవహరించినా.. దానిని ‘దుర్నీతి’గా అభివర్ణిస్తూ విరుచుకుపడిపోవడం.. ఇదంతా చాలా సహజం. పురాతన కాలంనుంచి వామపక్షాలకు పార్టీలే నడుపుతున్న పత్రికలు పుట్టిన రోజునుంచీ ఇదే పద్ధతి అమల్లో ఉంది. ఆ రాతలన్నీ కూడా ‘జర్నలిజం’గానే చెలామణీ అవుతూ వస్తున్నాయి. అయితే దారుణం ఏంటంటే.. ఇలాంటి ‘సమర్థింపు రాత’ల్ని సాక్షి దినపత్రిక కొత్తపుంతలు తొక్కిస్తోంది. మిధున్‌రెడ్డి ఎయిర్పోర్ట్ మేనేజర్‌ను కొట్టాడు అంటే.. కేసు నడుస్తోంటే దానికి సంబంధించి స్పందించడానికి తోడు.. ఆధారాలు అంటే ఎలా ఉండాలో… పాత్రికేయ ప్రపంచానికి విలువలను, నీతి రీతులను ప్రబోధించే ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నంలో.. చాలా చవకబారు తనంగా వ్యవహరిస్తున్నది అనే విమర్శలు కూడా వస్తున్నాయి.
ఎంపీ మిధున్‌రెడ్డి, రేణిగుంట ఎయిర్పోర్ట్ మేనేజర్‌ను కొట్టాడనడానికి సంబంధించి.. ఇప్పుడు వివాదం నడుస్తోంది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని వీడియో ఆధారాలను విడుదల చేశారు. గుంపుగా దొమ్మీ లాగా జరిగిన ఆ దాడిని ఎక్కడో దూరం నుంచి (బహుశా) సెల్ఫోన్లలో చిత్రించిన వైనాన్ని వారు విడుదల చేశారు. అందులో మిధున్‌రెడ్డి, మేనేజర్ ఎవ్వరూ స్పష్టంగా కనిపించడం లేదు. అలా కన్పించకపోవడమే నిర్దోషిత్వానికి తార్కాణంలాగా ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెలరేగిపోతుండడం ఆశ్చర్యకరం. అంటే ‘దాడి’ అనే నేరానికి గురైన ప్రతి వ్యక్తి కొట్టిన వాడు కొడుతుండగా స్పష్టంగా కనిపించేలా షూట్ చేసిన వీడియోను వెంటబెట్టుకుంటే తప్ప సాక్షి దినపత్రిక దానిని పరిగణనలోకి తీసుకోకుండా ఉంటుందా? అనేది ఇక్కడ ఎదురవుతున్న పెద్ద ప్రశ్న. ఆ సంగతి పక్కన పెడితే…
నేరం మిధున్రెడ్డిది. బాధితుడు ఎయిర్పోర్ట్ మేనేజర్. కేసు- విచారణ నడుస్తూనే ఉన్నాయి. మధ్యలో తెలుగుదేశం పార్టీ ఇంత అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తున్నదో అర్థం కాని సంగతి. అదేదో తమ పార్టీకి సంబంధించిన బాధ్యత అయినట్లుగా వారు మిధున్ రెడ్డి వీడియోలను విడుదల చేయడం జరిగింది. అందులో అసలు ఆధారం లేదంటూ… వైకాపా ఇప్పుడు గళమెత్తుతోంది. తెదేపా అతి స్పందన పుణ్యమాని.. మేనేజర్ మీద దాడికేసు కాస్తా.. ”మిధున్‌రెడ్డి మీద తప్పుడు ఆధారాల ప్రదర్శన, తెదేపా కుట్ర” అనే వ్యవహారంగా మారిపోతున్నది. తెదేపా మౌనంగా ఉండిఉంటే కేసు ఇంకా బలంగానే ఉండేది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేదా వారి తరఫున సాక్షి దినపత్రిక ఇప్పుడు అసలు కేసు గురించి వదిలేసి.. తెదేపా ఆధారాల గురించే మాట్లాడుతున్నాయి. ఏదేమైనప్పటికీ వైకాపాకు సంబంధించినంత వరకు మిధున్ రెడ్డి కొట్టలేదని చెప్పడానికి, కొట్టారనే ఆధారాలు లేవని డబాయించడానికి వారికి సర్వహక్కులు ఉన్నాయి. తెదేపా ఆధారాల్ని నిందించడానికికూడా వారికి పూర్తి హక్కు ఉంది. మేనేజర్ తో వివాదాన్ని మిధున్‌కు వ్యతిరేకంగా తెదేపా కుట్రపూరితంగా వాడుకుంటున్నదనే ప్రచారాన్ని వైకాపా ఎంత తీవ్రంగా చేసి ఉన్నా.. వారి పార్టీకి గౌరవప్రదంగా ఉండేది. అయితే ఈ జగన్ కోటరీ చాలా లేకిగా, చవకబారుతనంగా.. వివాదంలోకి లోకేష్ పాత ఫోటోలను లాక్కు వచ్చింది.
చవకబారుతనానికి పరాకాష్ట!
అక్కడికేదో తాము పరిశుద్ధ మనస్కులైనట్లు.. కేవలం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నందువల్లనే వాటిని జనం దృష్టికి తెస్తున్నట్లు సాక్షి కొన్ని లోకేష్ ఫోటోలను ప్రచురించింది. ఓ అమ్మాయి భుజం మీద చేయి వేసి మరో చేతిలో లిక్కర్ గ్లాసుతోను, మరో అమ్మాయితో ఆటపాటల్లోను, ఓ అమ్మాయి ఇతర మిత్రులతో స్విమ్మింగ్ పూల్ లోను.. ఇలా లోకేష్ ఉన్న ఫోటోలను సాక్షి ప్రచురించింది. ఇవి బయటపెట్టి ఆధారాలు అంటే ఇలా ఉంటాయి అంటూ తమకు తాము కితాబిచ్చుకుంది. అయితే ఫోట్లో విదేశీ అమ్మాయిలున్న మాట వాస్తవమే అయినా వారందరితో లోకేష్‌కు అనైతిక సంబంధాలున్నాయనేంత భాష్యం చెబుతూ రాతలు రాసేశారు. అసలు విషయాన్ని వదిలేసి.. ఇలా లోకేష్ వ్యక్తిగతంగా మిత్రులతో ఉన్న ఫోటోలకు రంకుభాష్యాలు చెప్పడం ఏ రకంగా జర్నలిజం నీతి అనిపించుకుంటుందో సాక్షి గానీ, జగన్ గానీ చెప్పాలి.
ఇదే మాదిరి దిగజారుడుతనం ప్రదర్శించి.. ఓదార్పు యాత్రల పేరిట జగన్ ఊర్లు తిరుగుతూ.. జగన్ పల్లెల్లో ఆడవాళ్లకు పెట్టే ముద్దులను క్లోజప్‌లు మాత్రం సిరీస్‌గా ప్రచురించి.. ”ఆంటీలకు ముద్దులుపెట్టడం జగన్‌కు వేలం వెర్రి” అని ఎవరైనా ప్రచురిస్తే.. ఎంత నీచంగా ఉంటుందో సాక్షి దినపత్రిక కూడా ఆలోచించాలి. తమకు అనుకూలంగా ఉండే వక్రభాష్యాలు చెప్పడం అనేది మీడియా తమ హక్కుగా భావించే రోజులు వచ్చాయి. ఆ పోకడకు సాక్షి మరింత తాలింపు వేసి.. ‘రంకు భాష్యాలు’ చెప్పే రేపటితరం వైపు జర్నలిజంను తీసుకువెళుతున్నది అనిపిస్తోంది.