హైదరాబాద్: కాల్‌మనీ వ్యవహారం గురించి తెలియగానే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చలించిపోయారని, తీవ్ర మనస్తాపం చెందారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ చెప్పారు. రాజకీయాలకోసం ఇంతకు దిగజారతారా అని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. పద్మ ఇవాళ హైదరాబాద్‌లో తమ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాల్‌మనీ వ్యవహారంపై హైకోర్ట్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణకు ఎందుకు ఆదేశించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి మాఫియాకు కొమ్ము కాసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
మరోవైపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఒక బహిరంగలేఖ రాశారు. కాల్‌మనీ వ్యవహారాన్ని అధికారపార్టీ ప్రజాప్రతినిధులే తెరవెనక ఉండి నడిపించారని, బాధ్యులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరం హీనమైన, ఘోరమైన నేరాలకు అడ్డాగా మారిందని పేర్కొన్నారు. కాల్‌మనీ పేరిట వసూలు చేసిన్ ప్రతి పైసాను బాధితులకు తిరిగి ఇవ్వాలని కోరారు.