వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తరువాత ఇవ్వాళ్ళ విదేశీ పర్యటనకి బయలుదేరుతున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో గురువారం బ్రిటన్ కి బయలుదేరుతున్నారు. అక్కడ 10 రోజులుంటారు. మళ్ళీ 26న తిరిగి వస్తారని సమాచారం. ఒకపక్క ముద్రగడ పద్మనాభం దీక్ష కారణంగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. మరోపక్క వైకాపా ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు. ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి విదేశాలలో సేద తీరాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
పార్టీ వ్యవహారాలని చూసుకోవడానికి విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి సీనియర్ నేతలున్నందునే జగన్ నిశ్చింతగా బ్రిటన్ పర్యటనకి బయలుదేరుతున్నారని భావించవచ్చు. వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలోకి రప్పించడానికి ఇదే మంచి అవకాశంగా భావించి తెదేపా గట్టిగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. కనుక జగన్ తిరిగి వచ్చే వరకు వారిని పార్టీ మారకుండా కాపాడుకోవలసిన బాధ్యత ఆ సీనియర్ నేతలపైనే ఉంటుంది. ఈరోజు చిత్తూరు జిల్లా, పలమనేరు వైకాపా ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి తెదేపాలో చేరబోతున్నారు. మొన్న వైకాపా విస్తృత సమావేశానికి అమర్నాథ రెడ్డి కాకుండా మరో నలుగురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదని తెలుస్తోంది. వారు పార్టీ మారే ఉద్దేశ్యంతోనే కీలకమైన ఆ సమావేశానికి గైర్హాజర్ అయ్యుంటే, ఈ 10 రోజుల్లోనే పార్టీ మారే అవకాశం ఉంటుంది. అదే జరిగితే, అందుకు పార్టీలో సీనియర్ నేతలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఇక ముద్రగడ పద్మనాభం దీక్షకి జగన్మోహన్ రెడ్డి సంఘీభావం ప్రకటించడమే కాకుండా తన పార్టీ సీనియర్ నేతలని కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యేందుకు అనుమతించారు కనుక, ముద్రగడ విషయంలో వారికి స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లే భావించవచ్చు. కనుక ఆ విషయంలో వైకాపా నేతలు ఇప్పుడు ఏవిధంగా వ్యవహరించబోతున్నారనేది కొంచెం ఆసక్తికరమే. వారు కూడా జగన్ పద్దతిలోనే ఈ వ్యవహారాన్ని హ్యాండిల్ చేస్తారా లేక తమ ముద్ర కనిపించేవిధంగా వ్యవహరిస్తారా చూడాలి.
చాలా కీలకమైన సమయంలో పార్టీని సీనియర్ల చేతిలో పెట్టి జగన్ విదేశీ పర్యటనకి వెళ్ళడం ఒకవిధంగా వైకాపాలో కొత్త ప్రయోగంగానే భావించవచ్చు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలని, వ్యూహాలనే పార్టీ అమలు చేస్తోంది. ఈ 10 రోజులు జగన్ కలుగజేసుకోకుండా ఉన్నట్లయితే, పార్టీలో సమిష్టి నిర్ణయాలు తీసుకొని నడిపించడానికి అవకాశం ఏర్పడుతుంది. దాని వలన వైకాపాకి చాలా మేలు కలుగుతుంది.