ఎవ్వర్నీ నమ్మొద్దు, ఏ పార్టీనీ నమ్మొద్దు, అందరూ మోసం చేస్తారు… ప్రతిపక్ష నేత జగన్ ఇచ్చిన పిలుపు ఇది! శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన సభలో ప్రత్యేకహోదా విషయమై మాట్లాడుతూ… టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన ఎవ్వర్నీ నమ్మొద్దనీ, తనను మాత్రమే నమ్మాలనీ, ఎంపీ సీట్లు అన్నీ వైకాపాకి దక్కితే… హోదాపై తొలి సంతకం ఎవరు పెడతామని అంటే, వారికే అప్పుడు మద్దతు ఇస్తామన్నారు. గత ఎన్నికల్లో హోదా ఇస్తామని చెప్పిన మోడీ ఇవ్వలేదనీ, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అదే తరహాలో హామీ ఇచ్చి మోసం చేస్తారన్నారు. సరే… మోడీ ఇవ్వలేదు, కాంగ్రెస్ ఇస్తుందా అనే చర్చను పక్కనపెడితే… గడచిన నాలుగేళ్లుగా ప్రతిపక్ష పార్టీగా హోదా కోసం చేసిన ప్రయత్నమేదీ..? హోదా విషయమై కేంద్రాన్ని ప్రశ్నించలేని, భాజపాని డిమాండ్ చెయ్యలేని వైకాపాను మాత్రం ఎందుకు నమ్మాలి..? ఈ కోణంలో కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా..?
ఇక, అవినీతి… ఈ టాపిక్ లో భాగంగా ఇసుక నుంచి మట్టి దాకా అంటూ చెప్పిందే చెప్పారు. అవినీతి సొమ్ము ఏం చేసుకోవాలో చంద్రబాబుకి తెలీదనీ, అందుకే ఆ సొమ్ముతో వైకాపా ఎమ్మెల్యేలని కొన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అనేది లేదేమో అన్నట్టుగా జగన్ మాట్లాడారు. సరే… అంతటి అవినీతి జగన్ కంటబడినప్పుడు, ప్రజలముందు ఆధారాలు పెట్టొచ్చు కదా! ఎన్ని కోట్లు తిన్నారు, ఎక్కడ దాచారు, ఎలా సంపాదించారు… ఇవన్నీ సాక్ష్యాధారాలున్నప్పుడు కోర్టులను ఎందుకు ఆశ్రయించడం లేదు..? చంద్రబాబుపై గుర్రుగా ఉన్న భాజపాకి ఇలాంటి ఉప్పందించినా ఈపాటికే చట్టం తన పని తాను చేసుకునిపోయేది కదా! ఈ కోణం నుంచి కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా!
జగన్ చేసే ఇతర విమర్శలు కూడా వినీవినీ అందరికీ కంఠతా అయిపోయినవే. టెక్కలిలో కూడా అవే మళ్లీమళ్లీ జగన్ మాట్లాడారు, ఇక, ప్రజలందరి దయవల్లా, దేవుడి ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తే ఏం చేస్తామో తెలుసా అంటూ, నవరత్నాల్లో ఒక రత్నం గురించి చెప్పారు. ప్రతీ విద్యార్థికి చదువు ఫీజులు, జేబు ఖర్చులు, చదివించే కుటుంబానికి సొమ్ము.. ఇలా అన్నీ ఫ్రీ ఫ్రీ అన్నారు. ఇతర అష్ట రత్నాల్లో కూడా ఎక్కువ భాగం ఉచితాలు, డబ్బు పంపకాలే ఉంటాయనేదీ తెలిసిందే. ఇవన్నీ అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ ఎంత అవుతుంది..? జగన్ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అమాంతంగా రాష్ట్ర ఆదాయం మారిపోతుందా..? ఈయనేమో, ఏ పార్టీని నమ్మొద్దంటారాయె! అలాంటప్పుడు కేంద్రంలో ఆంధ్రాకి అనుకూలమైన ప్రభుత్వం ఉంటుందా..? భాజపాతో చంద్రబాబు తలబడితే ఏం జరుగుతోందో ప్రజలు చూస్తున్నారు. రేప్పొద్దున్న కేంద్రంలో ఏ పార్టీ అండలేని జగన్ ఇంతకుమించి రాష్ట్రం తరఫున ఏదో పోరాటం చేసేస్తారని ప్రజలు ఎలా నమ్ముతారు..? వ్యవస్థలోకి విశ్వసనీయత, పాలనలో సమూల మార్పు, ఇంకేదో ఇంకేదో.. ఇవన్నీ ఎలా వస్తాయి..? పైగా, కేసులూ విచారణలూ వాయిదాలూ వగైరాలు ఇప్పటికే జగన్ చుట్టూ చాలా ఉన్నాయి. ఈ కోణం నుంచి కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా!
ఇంకోటి… జగన్ కి వచ్చిన ఎంపీ సీట్లతో అవసరం లేని ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడితే, వైకాపా ఎంపీలు మద్దతుతో పని లేకుండానే ప్రధాని ఎన్నిక జరిగితే… అప్పుడు, వైకాపా కోరగానే ప్రత్యేక హోదా ఫైల్ మీద మొదటి సంతకం పెట్టడం కోసం ఎవరుంటారక్కడ..? అప్పుడేం చెయ్యగలరు జగన్..? ఈ కోణం నుంచి కూడా ప్రజలు ఆలోచిస్తారు!