విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో సాక్షి ప్రసారాలను నిలిపిసినందుకు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని తన లోటస్ పాండ్ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకు పడ్డారు. ఇటువంటి సమయంలో కూడా ఆయన తన ముఖ్యమంత్రి కలను మరిచిపోకుండా ‘ముఖ్యమంత్రి రేసులో ఉన్న అభ్యర్ధి’ అని పదేపదే చెప్పడం చాలా ఆశ్చర్యం, వినోదం కూడా కలిగిస్తుంది. అసలు ఒక సీరియస్ అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన తన మనసులో ఆ కోరికని దాచుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇంతకీ ఆయన ఏమ్మన్నారంటే “ఒక ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి రేసులో ఉన్న అభ్యర్ధి కానీ ఏదైనా మాట్లాడినా, ఏదైనా చేసినా దానికి అర్ధం ఉండాలి. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. లేకుంటే ఆ ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి మాటలకి విలువ ఉండదు. ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి ప్రజలలో తన విశ్వసనీయత కోల్పోతారు. ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తికి మాట నిలకడ చాలా అవసరం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం విషయంలో, తుని కేసు విషయంలో, కాపులకి రిజర్వేషన్ల విషయంలో రకరకాలుగా మాట్లాడుతున్నారు,” అని అన్నారు.
“ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మాట నిలకడ లేదు…ఎప్పుడూ అబద్ధాలే చెపుతుంటారు..అందుకే ఆయనకి విశ్వసనీయత లేదు,” అని చెపితే సరిపోయే దానికి “ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి” అనే పదం కూడా అదనంగా తగిలించి చెప్పుకోవడం చూస్తుంటే ఆయన ముఖ్యమంత్రి కావాలని ఎంతగా తహతహలాడిపోతున్నారో అర్ధం అవుతుంది. అయితే ఇప్పుడు ఆయన ఎంతగా తహతహలాడినా కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని ఖచ్చితంగా తెలిసిఉన్నప్పుడు ఆ విధంగా మాట్లాడకుండా ఉంటే నవ్వులపాలవకుండా ఉండేవారు. ఆయన ఆ మాట పదేపదే చెపుతున్న సమయంలో రాజకీయ దురందరుడని పేరు గాంచిన బొత్స సత్యనారాయణ ఆయన పక్కనే నిలబడి ఉన్నారు. ఆయన కూడా వారించే ప్రయత్నం చేయలేదు.