ప్రత్యేక హోదా కోరుతూ నేటి నుండి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గుంటూరు శివార్లలో నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, సీనియర నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ తదితరులు గుంటూరులో మకాం వేసి దీక్ష స్థలంలో వేదిక ఏర్పాటు, జనసమీకరణ పనులను పూర్తి చేసారు. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుండి ఉదయం గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి నేరుగా విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లి దర్శనం చేసుకొన్న తరువాత అక్కడి నుండి దీక్షా వేదిక చేరుకొంటారు. ఈసారి ఆయన నగర శివార్లలో దీక్ష చేపడుతున్నారు కనుక పోలీసులు కూడా ఆయన దీక్షకి ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
గత ఏడాదిన్నరగా ప్రత్యేక హోదా కోసం వైకాపా చేస్తున్న పోరాటాలు నేటి నుండి జగన్ చేపడుతున్న ఈ దీక్షతో కీలక దశకు చేరుకొందని వైకాపా చెపుతోంది. కానీ ఈ దీక్ష తరువాత వైకాపా భవిష్య కార్యాచరణను ఏవిధంగా ఉండబోతుందనే దానిని బట్టే ఫలితాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి తన దీక్షకు విద్యార్ధుల మద్దతు కోరారు. వారు మద్దతు ఇస్తారా లేదా? అనే సంగతి ఇప్పుడు తేలిపోతుంది. ఒకవేళ వారు మద్దతు ఇస్తే ఈ ఉద్యమం ఉదృతం అవుతుంది. లేకుంటే నాలుగయిదు రోజుల తరువాత పోలీసులు జగన్ దీక్షను భగ్నం చేయడంతో ముగిసిపోవచ్చును. ప్రత్యేక హోదా కోసం వైకాపా చేస్తున్న ఈ హడావుడి వలన రాష్ట్రంలో మళ్ళీ ఆత్మహత్యలు మొదలయ్యే ప్రమాదం మాత్రం ఉంది.