“రిషితేశ్వరి ఆత్మహత్యలో దోషులు ఎంత పెద్దవారయినా వదిలిపెట్టబోము. కటినంగా శిక్షిస్తాము. మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకొంటాము..” అని ప్రభుత్వం, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు పదేపదే చెప్పడం అందరూ విన్నారు. ప్రభుత్వం కమిటీ వేసింది. పోలీసులు దర్యాప్తు చేసారు. కొందరిపై కేసులు పెట్టారు. కానీ నేటికీ ఆమె మరణానికి అసలయిన కారకులెవరో గుర్తించనే లేదు. కళాశాల ప్రిన్సిపాల్ బాబురావును, మరో ఇద్దరినీ సస్పెండ్ చేసి వారి స్థానంలో వేరొకరిని నియమించడంతో ఈ కేసు పరిష్కారం చేసినట్లే ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. మళ్ళీ ఇంతలోనే కడపలో నారాయణ కాలేజీలో నందిని, మనీషా అనే ఇద్దరు విద్యార్ధినులు ఒకేసారి ఒకే రూములో సోమవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకొన్నారు. మళ్ళీ అక్కడ కూడా అదే తంతు మొదలయింది. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మంత్రి గంటా శ్రీనివాసరావు వారి మృతిపై విచారణ జరిపించేందుకు త్రిసభ్య కమిటీని వేస్తున్నట్లు ప్రకటించారు. బహుశః దీనికి కూడా అటువంటి ముగింపే ఇవ్వవచ్చును.
నారాయణ కాలేజీ యాజమాన్యం తీరుని నిరసిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కడప బంద్ కి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలపై చాలా తీవ్ర ఆరోపణలు చేసారు. నారాయణ కాలేజీలలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వాటా ఉంది గనుకనే వివిధ జిల్లాలలో ఉన్న ఆ కాలేజీ బ్రాంచీలలో ఇంతవరకు 11 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొన్నా ఆ సంగతి బయటకు పొక్కకుండా కాపాడుతున్నారని ఆరోపించారు. అంతేకాదు నారాయణ కాలేజీని గ్రామాలకు కూడా విస్తరించే ప్రయత్నంలో భాగంగానే ఇదివరకు మూడు కిమీలకు ఒక పాఠశాల ఉంటే వాటిని 8కిమీకి ఒకటి చొప్పున కుదించి ఆ కాలేజీ విస్తరణకు సహకరిస్తున్నారని ఆరోపించారు. మంత్రి గంటా కుమారుడుకి మంత్రి నారాయణ కుమార్తెనిచ్చి త్వరలో వివాహం చేయబోతున్నారు కనుకనే ఆయన తన కాబోయే వియ్యంకుడికి చెందిన నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా పట్టించుకోవడంలేదని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
చనిపోయిన విద్యార్ధులు ఇద్దరూ మెరిట్ స్టూడెంట్స్ కావడంతో వారు చదువుల ఒత్తిడి వలన చనిపోయే అవకాశం లేదు. మంత్రికి చెందిన కాలేజీలో ర్యాగింగ్ జరిగితే అప్రదిష్ట. సమస్యలు వస్తాయి. కనుకనే ప్రేమ వ్యవహారం కారణంగా వారిద్దరూ ఆత్మహత్యలు చేసుకొన్నట్లు నిరూపించడానికి లవ్ లెటర్లు సృష్టించారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అభం శుభం తెలియని ఇద్దరు విద్యార్ధులు ప్రాణాలు తీసుకొంటే దానిపై నిజాయితీగా దర్యాప్తు చేసి దోషులను శిక్షించే ప్రయత్నం చేయకుండా ఇలాగ చనిపోయిన విద్యార్ధులపై లేనిపోని అభాండాలు వేస్తారా? అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కాలేజీ యాజమాన్యాలు చాల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా కూడా ప్రభుత్వం వారిని శిక్షించకుండా ఈవిధంగా వెనకేసుకువస్తుంటే ఇక తల్లి తండ్రులు తమ పిల్లలల్ని కాలేజీలకు పంపడానికి భయపడే పరిస్థితి ఏర్పడుతోందని జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే దీనిపై సీబీఐ చేత విచారణ జరిపించి దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేసారు.
విద్యార్ధుల మరణానికి కారణమయిన నారాయణ విద్యాసంస్థలను తక్షణమే మూసివేయించి, మంత్రి నారాయణను పదవిలో నుండి తొలగించి అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ వ్యవహారంపై జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగానే స్పందించారు. అందుకు గల రాజకీయ కారణాలను పక్కనబెడితే, ఆయన ఆవేదనలో అర్ధం ఉంది. ఆయన ప్రశ్నలకు ముఖ్యమంత్రి, ఆ మంత్రులిద్దరూ కూడా జవాబు చెప్పవలసిన అవసరం ఉంది.
“మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కావు” అని మంత్రి గంటా భరోసా ఇచ్చి గట్టిగా పది రోజులు కూడా కాలేదు. కానీ ఈసారి ఇద్దరు విద్యార్ధులు ప్రాణాలు తీసుకొన్నారు. మరి దీనికి మంత్రి జవాబు ఏమిటో? ఎక్కడో సుదూర రాష్ట్రాల నుండి అనేక మంది విద్యార్ధులు మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ కార్పోరేట్ కాలేజీలలో చదువుకొంటున్నారు. కానీ ఇటువంటి సంఘటనల వలన అన్ని కాలేజీలకి చెడ్డపేరు వస్తుంది. ఈ సమస్యను రాజకీయాలకు ముడేసి చూడటం కంటే సమస్యను సమస్యగానే చూసి పరిష్కారాల కోసం ప్రయత్నించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.