ప్రధాని మోడీతో జగన్ ఆకస్మిక అప్రకటిత భేటీ ఒక్కసారిగా ఎపి రాజకీయాలను వేదెక్కించింది. వైసీపీ టీడీపీ నేతలు షరామామూలుగా దీనిపై ఆరోపణల యుద్ధం చేస్తున్నా ఉభయులలోనూ వుండాల్సిన వూపు లేదు. ఓటుకు నోటు కేసులో మీరు లొంగిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ అంటుంటే కేసులకోసం మీరు లాలూచీ పడుతున్నారని టిడీపీ ఆరోపిస్తూ వచ్చింది. ఇప్పుడు ఇద్దరికీ ఆ అవకాశం లేనట్టే. ఎందుకంటే అవతలివారిపై చేసే ఆరోపణ తమకూ వర్తిస్తుంది మరి! ఇక ప్రత్యేక హౌదాకు సంబంధించి కూడా మీకు అర్హత లేదంటే మీకు లేదనుకోవడం తప్ప ఇద్దరి పరిస్థితి ఒక్కలాగే వుంది.
గతంలో అన్న ప్రకారమైతే హౌదా ఇవ్వకపోతే జూన్ తర్వాత రాజీనామా చేస్తామన్నది జగన్ ప్రకటన. తాజా ఢిల్లీ యాత్రలో ఆ వూసే లేదు. ఇక ఎన్డిఎలో రెండవ పెద్ద భాగస్వామిగా వున్న టిడిపి మరో పార్టీ వచ్చి బలపరుస్తానంటే ఎలా వ్యతిరేకిస్తుంది? హౌదాబడులు ఉత్తుత్తి ప్యాకేజీకి ప్రశంసలు పాడిన టిడిపి ఇప్పుడు వైసీపీని ఏమన్నా ఏం విలువ వుంటుంది? మొత్తంపైన ఈ గజిబిజిలో లాభపడే రాజకీయ శక్తి బిజెపి ఒక్కటే కనిపిస్తుంది. చంద్రబాబును న్యూట్రలైజ్ చేసి మరింత అదుపులోకి తెచ్చుకోవడానికి వారు జగన్‌ను తురుపుముక్కగా వాడుకున్నారు. మీమేదో మీపైనే ఆధారపడి లేము అని సంకేతమిచ్చారు. ఇప్పటి వరకూ ఎపి బిజెపిలో చంద్రబాబు అనుకూల ప్రతికూల స్వరాలు రెండూ వుంటున్నాయి. అలాగే అధికార యంత్రాంగం కూడా వైసీపీని ఏమాత్రం పట్టించుకోనవసరం లేదన్నట్టు రూపొందింది. ఇప్పుడు ఏకంగా ప్రధాని పిలిచి మాట్లాడారు గనక అధికారులు అంత నిర్లక్ష్యంగా వుండలేరు. బిజెపిలో అంతర్గతంగా చూస్తే వెంకయ్య నాయుడు బృందాన్ని కూడా తన చర్యతో మోడీ దెబ్బతీశారని ఆ పార్టీ నేతల కథనం. ఇదే రీతిలో అమిత్ షా మోడీ ద్వయం వచ్చే ఎన్నికల వరకూ దూసుకుపోతుందని ఇక వెంకయ్య నాయుడు రోజూ చంద్రబాబును పొగుడుకుంటూ వుంటానంటే తాము బలపర్చనవసరం లేదని రాష్ట్ర నాయకులు సంతోష పడుతున్నారు. దీనిపై ఎన్టీవీ చర్చలో నన్ను ప్రశ్న వేసినపుడు వైసీపీ టీడీపీల కన్నా బిజెపి ఎజెండా ఇక్కడ ముఖ్యపాత్ర వహిస్తుందని చెప్పాను. శివసేనతో సహా ప్రాంతీయ పార్టీలను పక్కకు తోసి దేశమంతా తమ ప్రత్యక్షాధీనంలోకి తెచ్చుకోవాలన్నది వారి ఆలోచన, ఆశ. మే25న అమిత్‌షా విజయవాడ వచ్చేనాటికి అన్నీ ఒక కొలిక్కి తీసుకురావాలని పాచికలు వేస్తున్నారట. ఏమైనా జగన్‌ను పిలిపించడం మాత్రం చంద్రబాబు ప్రాభవాన్ని తగ్గిస్తుందనేంత వరకూ అందరూ అంగీకరిస్తున్నారు. ఇప్పుడే వైసీపీ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు గుజరాత్ మారణకాండ సమయంలో మోడీపట్ల తీవ్రంగా మాట్లాడి తర్వాత అవసరాల కోసం నెత్తిన పెట్టుకున్నారంటూ క్లిప్పింగులు ప్రదర్శిస్తున్నది. టిఆర్ఎస్ ఎలాగూ బిజెపికి మద్దతు నిస్తున్నది గాని వైసీపీ కూడా అటే మొగ్గడంతో మూడు ప్రధాన తెలుగు పార్టీలూ ఒకేవైపు చేరినట్టయింది!చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చాక గాని దీనిపై స్పష్టమైన వ్యాఖ్యలు రావు. ఈలోగా మంత్రి నారాయణ కుమారుడి విషాద మరణం కూడా నాయకులందరూ నెల్లూరు వెళ్లడానికి కారణమైంది. ఇది ఏదో విధంగా తమకూ మేలేనని కాంగ్రెస్ నాయకులు కూడా సంతోషించడం కొసమెరుపు.సిపిఎం సిపిఐలు మాత్రం జగన్‌ది అవకాశవాదమని ప్రకటించాయి.