రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎం.ఎస్.ఓ.లు జగన్ కి చెందిన సాక్షి న్యూస్ ఛానల్ ప్రసారాలను విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలలో నిన్నటి నుండి నిలిపివేశారు. దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయనఏమన్నారంటే:
“ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సామాజిక సమస్యని, రాజకీయ సమస్యగా మార్చి, మళ్ళీ దానిని శాంతి భధ్రతల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. కిర్లంపూడి ఒక చిన్న గ్రామం. అక్కడ ముద్రగడ పద్మనాభం తన ఇంట్లో కూర్చొని దీక్ష చేసుకొంటుంటే, అదేదో పెద్ద శాంతి భద్రతల సమస్య అన్నట్లుగా వందాలాది పోలీసులను అక్కడ దింపి, గ్రామస్తులను చివరికి ముద్రగడ కుమారుడిని వారి చేత చితకబాదించి అందరినీ భయబ్రాంతులని చేసి, ఆయనని బలవంతంగా అరెస్ట్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న పని తప్పు అని చెప్పినందుకు సాక్షి ప్రసారాలను కట్ చేసేశారు. రాష్ట్ర చరిత్రలో దీనిని బ్లాక్ డేస్ అని భావిస్తున్నాను. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ఎమర్జన్సీ విధించినట్లు కనిపిస్తోంది,” అని అన్నారు.
“తుని విద్వంసానికి కారకులంటూ పోలీసులు అమాయకులైన ప్రజలను అరెస్టులు చేస్తున్నారు. ఆ అల్లర్ల వెనుక నేను, నా పార్టీ నేతలే ఉన్నారని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అధికారం ఆయన చేతిలోనే ఉంది కనుక ఆయన అది నిజమని నమ్ముతున్నట్లయితే తక్షణమే సిబిఐ విచారణకి ఆదేశించకవచ్చు కదా? అప్పుడు ఎవరు బాధ్యులో తెలిసిపోతుంది. దీని వెనుక ఆయనే ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఆయన ఒక పథకం ప్రకారం ముద్రగడ ఉద్యమాన్ని దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతోనే ఆ కుట్రకు పాల్పడి ఉంటారని నేను అనుమానిస్తున్నాను. గతంలో ఆయనే తన ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు ఫోన్లు చేసి, బస్సులు, రైళ్ళు తగులబెట్టమని, రాష్ట్రంలో విద్వంసం సృష్టించమని చెప్పినట్లు ముద్రగడ స్వయంగా చెప్పారు. కనుక ఇది కూడా ఆయన కుట్రగానే భావిస్తున్నాను. అందుకే తను చెప్పినట్లు వినే పోలీసులతో, సిఐడితో విచారణ జరిపిస్తూ కేసుని తనకి నచ్చినట్లు తయారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి దమ్ము, ధైర్యం, నిజాయితీ ఉన్నట్లయితే ఈ కేసును తక్షణమే సిబిఐకి అప్పగించాలని నేను డిమాండ్ చేస్తున్నాను,” అని జగన్మోహన్ రెడ్డి అన్నారు.
తన సాక్షి టీవీ ఛానల్ ప్రసారాలను నిలిపివేయడం గురించి జగన్ మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించినట్లుగా చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారు. ఇవ్వాళ్ళ సాక్షి రేపు మరో ఛానల్ కి ఈ పరిస్థితి రావచ్చు. దీనిని అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకుంటే ఇదే దుష్ట సంప్రదాయం స్థిరపడిపోతుంది. అప్పుడు అధికారంలో ఎవరు ఉంటే వారికి అనుకూలంగా వార్తలు ప్రసారం చేసే చానల్స్, పత్రికలూ మాత్రమే ఉండనిచ్చి మిగిలినవాటిని కట్ చేయడం మొదలవుతుంది. తమిళనాడులో అన్నాడిఎంకె, డిఎంకె రెండు పార్టీలకి న్యూస్ చానల్స్ ఉన్నాయి. ఆ రెండు పార్టీలు రాజకీయంగా ఎంతగా విభేధించుకొన్నా, వాటిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రత్యర్ధి పార్టీ ఛానల్ జోలికి వెళ్ళవు. కానీ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తనకు వ్యతిరేకంగా వార్తలు వ్రాసే మీడియా గొంతు నొక్కేస్తున్నారు. దీనిని అందరూ కలిసి అడ్డుకోవాలి, ” అని అన్నారు.