తెదేపా మంత్రులు, నేతలు తమ వాగ్ధాటితో జగన్మోహన్ రెడ్డి చేసే విమర్శలను, దీక్షలను కొట్టిపడేస్తుంటారు కానీ అంతమాత్రాన్న వాస్తవాలను దాచిపుచ్చడం అసాధ్యమనే సంగతి గ్రహించడం లేదు. ఆంద్రప్రదేశ్ లో “ఆల్-ఈజ్ వెల్” అని పాట పాడుతున్న తెదేపా ప్రభుత్వం కొన్నినెలల క్రితం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను పరామర్శించడానికి బయలుదేరినప్పుడు ఉలిక్కి పడింది. వెంటనే అప్రమత్తమయిన తెదేపా మంత్రులు, నేతలు జగన్ శవరాజకీయాలు చేస్తున్నాడంటూ విమర్శలు గుప్పించారు. కానీ ఆయన యాత్రకి బయలుదేరే ముందురోజు ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలకు ఇచ్చే నష్ట పరిహారాన్ని పెంచుతూ ప్రభుత్వం ఒక జీ.ఓ. జారీ చేసింది. అంటే రాష్ట్రంలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నట్లు ద్రువీకరించినట్లే అయింది. కానీ ఆ తరువాత జగన్ వేరే ఇతర అంశాలపై దృష్టి మళ్ళించి తన పోరాటాలు కొనసాగించడం మొదలుపెట్టడంతో రైతుల ఆత్మహత్యల సమస్య కూడా మూలపడింది. కానీ నేటికీ అనేక జిల్లాలలో రైతుల పరిస్థితి అలాగే ఉంది.
అదేవిధంగా తెదేపాకి కంచుకోటగా చెప్పుకోబడే కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజక వర్గంలోని కొత్తమాజేరు గ్రామస్తులు గత కొన్ని రోజులుగా విషజ్వరాలతో బాధపడుతున్నారు. దాని గురించి పత్రికలలో కూడా వార్తలు వచ్చేయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు మేల్కొనలేదు. విష జ్వరాల కారణంగా కొందరు గ్రామస్తులు మరణించారు. ప్రభుత్వం ఇంతవరకు మేల్కొనకపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు అక్కడికి వెళ్లి బాధితులను పరమార్శించిన తరువాత, బాధిత కుటుంబాలకు తక్షణమే ఆర్ధిక, వైద్య సహాయం అందించాలని కోరుతూ మచిలీపట్నంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయబోతున్నారు.
ఈ సంగతి తెలుసుకొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డా. కామినేని శ్రీనివాస్ యదాప్రకారం జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. జగన్ ఒక రాబందు వంటి వాడని, రాబందులు శవాలకోసం ఎలాగా అన్వేషిస్తుంటాయో అతను కూడా అలాగే రాష్ట్రంలో ఎవరు చనిపోయారా అని అన్వేషిస్తూ ఎక్కడ ఎవరు చనిపోతే అక్కడ తక్షణమే వాలిపోతుంటాడని చాలా అనుచితమయిన వ్యాఖ్యలు చేసారు. కొత్తమాజేరు గ్రామంలో విషజ్వరాలు సోకాయనే సంగతి తెలుసుకొని వాటి నివారణ కోసం తక్షణమే స్పందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ముఖ్యంగా సదరు మంత్రిగారిదే. కానీ ఆయన విఫలం అయినప్పుడు జగన్ ఆయన దృష్టికి ఈ సమస్యను తీసుకు వస్తున్నప్పుడు సానుకూలంగా స్పందించకపోగా ఈవిధంగా అనుచితంగా మాట్లాడటం, జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించడం చాలా తప్పు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేయడం కంటే ఆ తప్పును సరిద్దిద్దుకొనే ప్రయత్నం చేసినట్లయితే అందరూ హర్షిస్తారు.