ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజుల క్రితం డిల్లీలో ఒకరోజు దీక్ష చేసారు. ఆ తరువాత రాష్ట్ర బంద్ కూడా నిర్వహించారు. మళ్ళీ ఈనెల 26వ తేదీ నుండి గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారని వైకాపా ప్రకటించింది. కానీ ఆయన చేస్తున్న ఈ హడావుడిపై ఇంతవరకు కేంద్రం స్పందించనే లేదు. రాష్ట్ర మంత్రులు మాత్రం కొంచెం ఘాటుగానే స్పందించారు. రాజకీయ నాయకులు చేస్తున్న ఈ హడావుడి వలన ప్రత్యేక హోదా వస్తుందో లేదో తెలియదు కానీ వారి హడావుడి పెరిగినప్పుడల్లా భావోద్వేగాలకిలోనయి అనేక మంది ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. గత వారం పదిరోజులుగా రాష్ట్రంలో ప్రత్యేక హోదా హడావుడి లేకపోవడంతో ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడినట్లు వార్తలు వినపడలేదు.
జగన్ ఆమరణ నిరాహార దీక్షకి వైకాపా విస్త్రుతమయిన ప్రచారం, ఏర్పాట్లు చేయడం తధ్యం. అలాగే జగన్ చేయబోయే నిరాహార దీక్షని విజయవంతం చేసేందుకు భారీగా జనసమీకరణ చేస్తుంది. వారి హడావుడి పెరిగితే మళ్ళీ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు మొదలయినా ఆశ్చర్యం లేదు. జగన్ ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోబోతున్నట్లు ప్రకటించినప్పటికీ, ఈరోజుల్లో ఆమరణ దీక్షలు ఎన్ని రోజుల్లో ఏవిధంగా ముగుస్తున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ రాజకీయ పార్టీలు ఆడుకొంటున్న ఈ ప్రత్యేక చదరంగంలో సామాన్యులు పావులుగా మారి ఓడిపోతున్నారు. ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు చేస్తున్న పోరాటాల వలన ఆ పార్టీలు బలోపేతం అవుతుంటే, అమాయకులయిన వ్యక్తులు కొందరు ప్రాణాలు తీసుకొంటున్నారు. అటువంటివి జరుగకుండా నివారించవలసిన రాజకీయ పార్టీలు, వారి మరణాలకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పి చేతులు దులుపుకొంటున్నాయి.