ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గుంటూరులో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష నేటితో మూడవ రోజుకి చేరింది. జగన్ దీక్షకు మద్దతుగా చెన్నై వంటి పొరుగు రాష్ట్రాల నుండి కూడా ఆయన అభిమానులు తరలివస్తున్నారు. ఇక రాష్ట్రంలో వైకాపా శ్రేణులు కూడా భారీగా తరలివచ్చి ఆయనకు మద్దతు తెలుపుతున్నాయి. కానీ తెలంగాణా రాష్ట్రం నుండి వైకాపా నేతలు, కార్యకర్తలు ఎవరూ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన రాష్ట్రం కోసమే ఈ దీక్ష చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రజలు కూడా ఆయన దీక్షకు అంతగా స్పందించక పోవడం విశేషం. అదేవిధంగా మీడియా కూడా ఆయన దీక్ష గురించి ఏదో నామమాత్రంగా న్యూస్ లో పేర్కొంటోంది తప్ప పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదివరకు నటుడు శివాజీ ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా ప్రజలు, మీడియా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆయన దీక్షకు ఎటువంటి జనసమీకరణ చేయకుండానే చాల మంది ప్రజలు, ప్రజా సంఘాలు స్వచ్చందంగా తరలివచ్చి మద్దతు తెలిపారు. జగన్ దీక్షకు మంద కృష్ణ మాదిగ వచ్చి మద్దతు తెలిపారు. జగన్ దీక్షకు మద్దతుగా నేడు మండల కేంద్రాల్లో, రేపు నియోజక వర్గాలలో వైకాపా ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించుకొంది. మూడు రోజులుగా జగన్ నిరాహరంగా ఉండటంతో ఆయన బాగా నీరసించిపోయారు. వైద్యులు ఎప్పటికప్పుడు ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించి ప్రభుత్వానికి సమాచారం అందిస్తున్నారు. కనుక వారి సలహా మేరకు ప్రభుత్వం త్వరలోనే పోలీసులను పంపి ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించవచ్చును. బహుశః ఆదివారంనాటికి ఆయన దీక్ష ఐదవరోజుకి చేరుకొంటుంది కనుక ఆరోజే పోలీసులు రంగ ప్రవేశం చేస్తారేమో?