జగన్మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష నేటితో ఐదవ రోజుకి చేరింది. ఐదు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆయన బాగా నీరసించిపోయారు. ఆయన బీపీ, షుగర్ లెవెల్స్ క్రమంగా పడిపోతుండటంతో వైకాపా నేతల్లో ఆందోళన మొదలయింది. మొదటి మూడు రోజులు ఎంతో ఉత్సాహంగా, ఉద్రేకంగా ప్రత్యేక హోదా గురించి ప్రసంగాలు చేసిన వైకాపా నేతలు అందరూ ఇప్పుడు జగన్ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు. తమ నాయకుడికి ఏదయినా జరగరానిది జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నారు. ఐదు రోజులుగా జగన్ నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వచ్చి రోజూ జగన్ కి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆ నివేదికలని ప్రభుత్వానికి అందజేస్తున్నారు. కనుక ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే వైకాపా నేతల వాదన అర్ధరహితం.
ప్రత్యేక హోదా అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోలేని అంశం. కనుక దానిపై కేంద్రప్రభుత్వం ఒత్తిడి తెచ్చి దాని నుండి ఏమయినా హామీ పొందగలిగితే ఏమయినా ప్రయోజనం ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఒకవేళ ఇస్తే అది మభ్యపెట్టడమే అవుతుంది. కనుక జగన్ దీక్ష విరమించడానికి వైకాపా నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఒత్తిడి చేయడం కంటే నేరుగా కేంద్రప్రభుత్వాన్నే నిలదీస్తే మంచిది. జగన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తున్న ప్రభుత్వం బహుశః ఈరోజు అర్ధరాత్రి పోలీసులను పంపించి ఆయన దీక్ష భగ్నం చేసి ఆసుపత్రికి తరలించవచ్చును. జగన్ ఆరోగ్యం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న వైకాపా నేతలు మళ్ళీ అప్పుడు పోలీసులకు అడ్డుపడతారు. కానీ జగన్ ఆరోగ్యం క్షీణిస్తే వైకాపా నేతల కంటే రాష్ట్ర ప్రభుత్వంపైనే ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది కనుక నేడో రేపో ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించడం తధ్యం. ఆ తరువాత ప్రత్యేక హోదా కోసం ఏవిధంగా పోరాటం కొనసాగించాలో వైకాపా నేతలు వారి అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకోవలసి ఉంటుంది.