ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్, వైకాపాలు రెండూ రెండు వేర్వేరు కారణాలతో ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొని పోరాటాలు మొదలుపెట్టాయి. ఆ కారణాలు అందరికీ తెలుసు. కాంగ్రెస్ మొదలుపెట్టిన పోరాటాలకి ప్రజల నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో తన పోరాటాలను జగన్మోహన్ రెడ్డికి “హ్యాండోవర్” చేసి ఆయనకు మద్దతు ప్రకటించింది. అయినా ఫలితం లేకపోవడంతో రెండు పార్టీలు తమ ప్రత్యేక పోరాటాలను ముగించినట్లే ఉన్నాయి.
నిరంతరంగా పోరాటాలు కొనసాగించడానికి వీలుకల్పించే ప్రత్యేక హోదా వంటి అంశం మరొకటి లేకపోవడంతో కాంగ్రెస్, వైకాపాలు రెండూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నయిప్పుడు. బహుశః ఆ ప్రయత్నంలోనే వారికి రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమాలు మొదలుపెడితే ఎలాగుటుంది? అనే ఆలోచన కలిగి ఉండవచ్చును. ఇది ఊహాత్మకమే కావచ్చును. కానీ ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు మాత్రమే అందుకు సిద్దపడుతుండటం వలన అనుమానించవలసి వస్తోంది. వైకాపాలో సీనియర్ నేత ఎం.వి. మైసూరారెడ్డి పార్టీకి రాజీనామా చేసి ఈనెల 21 నుండి ఉద్యమాలు ప్రారంభించబోతున్నట్లు (ఒక్క సాక్షిలో తప్ప) అన్ని మీడియా చానళ్ళలో, పత్రికలలో వార్తలు వచ్చేయి. కానీ ఆ వార్తలను జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఖండించలేదు. పార్టీలో ముఖ్యనేత ఒకరు పార్టీకి రాజీనామా చేసి ఉద్యమాలను మొదలుపెట్టబోతున్నారని తెలిసినా కూడా ఆయన కనీసం స్పందించలేదు. అదే ఈ అనుమానానికి తావిస్తోంది.
రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమాలకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వబోదని రఘువీరా రెడ్డి నిర్ద్వందంగా ప్రకటించారు. కానీ పార్టీకి చెందిన నేతలు ఎవరయినా రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమాలకి వ్యక్తిగతంగా మద్దతు తెలిపితే కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం చెప్పదని మళ్ళీ చిన్న సవరణ ప్రకటన కూడా దానికి జోడించారు. కనుక కాంగ్రెస్ పార్టీ కూడా పరోక్షంగా మద్దతు ఇస్తోందనే భావించాల్సి ఉంటుంది. ఆ రెండు పార్టీలు తమ రాజకీయ మనుగడ కోసమో లేకపోతే తమ ఉమ్మడి రాజకీయ శత్రువు తెదేపాని, దాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని దెబ్బ తీయడానికో ఇటువంటి భయంకరమయిన ఆలోచనలు చేస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాటికి యావత్ రాష్ట్ర ప్రజలు చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. రాయలసీమకు చెందిన రఘువీరా రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి నిజంగా తమ ప్రాంత అభివృద్ధి జరగాలని బలమయిన కోరిక ఉన్నట్లయితే వారు దాని కోసం ప్రభుత్వంతో ఎంతయినా పోరాడవచ్చును. వారిలో జగన్మోహన్ రెడ్డికి శాసనసభలో ప్రభుత్వంతో పోరాడేందుకు అవసరమయిన బలం కూడా ఉంది. తమ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయవలసింది పోయి, తమతమ రాజకీయ లబ్ది కోసం మళ్ళీ రాష్ట్రాన్నే విడగోట్టాలనుకొంటే ప్రజలు వారిని క్షమించబోరు.