ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా నిత్యం వివిధ సమస్యలపై ప్రభుత్వంతో యుద్ధం చేస్తూ, అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తూనే ఉంది. కానీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనకున్న రెండు బలహీనతలని వదిలించుకోలేకపోవడం వలన ఆయన చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి. అవి: 1. చంద్రబాబు నాయుడుని వ్యక్తిగతంగా ద్వేషించడం. 2. ముఖ్యమంత్రి అయిపోవాలనే తాపత్రయం.
ఆ రెండు బలహీనతలనే పార్టీ సిద్దాంతాలు, బలంగా భావించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయ పార్టీలు ఒక దానిని మరొకటి శత్రువుగా భావించుకోవడం, విమర్శలు చేసుకోవడం సహజమే కానీ వ్యక్తిగత స్థాయిలో ద్వేషించుకోవడం చాలా అసహజంగా ఉంటుంది.
అలాగే ప్రతీ రాజకీయ పార్టీ అధికారంలో ఉండాలని లేకుంటే అధికారంలోకి రావాలని కోరుకోవడం కూడా సహజమే కానీ మాంసం తింటామని ఎవరూ ఎముకలను మెళ్ళో వేసుకొని తిరుగనట్లే, అధికారం కోసం పోరాడుతున్న వాళ్ళు ఆ తాపత్రయాన్ని బయటపెట్టుకోకూడదు. జగన్ మాత్రం అవకాశం చిక్కినప్పుడల్లా తను ముఖ్యమంత్రి కావాలనే కోరిక బయటపెట్టుకొంటూనే ఉంటారు. అందుకు ఇంకా ఎంత సమయం ఉందో రోజులు, నెలలు లెక్క పెట్టుకొంటూనే ఉంటారు. ఎన్నికల సమయంలో ఆవిధంగా మాట్లాడితే అది ఆత్మవిశ్వాసంలాగ కనిపిస్తుంది. మిగిలిన సమయంలో మాట్లాడితే అది అధికార యావగా కనిపిస్తుంది.
ఇంతవరకు ఆయనకి రెండుసార్లు అటువంటి అవకాశం వచ్చింది. మొదటిసారి తన తండ్రి రాజశేఖర్ ఆకస్మిక మృతి తరువాత. మళ్ళీ రెండవసారి 2014 ఎన్నికలలో. కానీ రెండుసార్లు అయన తన కలను నెరవేర్చుకోలేకపోయారు. కనుక ముచ్చటగా 3వ సారైనా అది సాధ్యం అవుతుందో లేదో తెలియనప్పుడు, తనే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవబోతున్నట్లు, అప్పుడే ప్రజల కష్టాలన్నీ తీరిపోతాయనట్లుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం చూసి పార్టీలో నేతలే నవ్వుకొంటున్నారు. వచ్చే ఎన్నికలలో వైకాపా గెలవడం, జగన్ ముఖ్యమంత్రి అవడం గురించి ఆలోచించే ముందు అప్పటి వరకు పార్టీలో ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు మిగులుతారు? ఒకవేళ మరో 15-20మంది ఎమ్మెల్యేలు బయటకి వెళ్ళిపోతే పార్టీ పరిస్థితి ఏమిటి?అని ఆలోచించుకొని నష్ట నివారణ చర్యలు చేపడితే బాగుంటుంది.