తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. జగన్ రెడ్డికి ఎంత సన్నిహితుడో చెప్పాల్సిన పని లేదు. ఏపీలో చాలా కాంట్రాక్టులు పొందారు. వాటిలో ఎంత లాభం పొందారో కానీ ఓ కాంట్రాక్ట్ విషయంలో పొంగులేటికి డబుల్ టెండర్ పడినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల ఏడాదిలో మైనింగ్ చేసే వారి నుంచి సీవరేజీ వసూలుకు జిల్లాల వారీగా కాంట్రాక్టర్లను ఎంపిక చేశారు. అసలు ఈ కాంట్రాక్టర్ల పని ఎన్నికల్లో డబ్బులు పంచడం. గనుల యజమానుల నుంచి సీవరేజీ వసూలు చేసి దాన్ని ఎన్నికల సమయంలో అభ్యర్థులకు ఓటర్లకు పంపిణీ చేసేందుకు సర్దుబాటు చేయాలనేది అనధికారిక ఒప్పందం. అసలు ఒప్పందంలో ప్రతి నెలా ప్రభుత్వానికి చెల్లించాలని ఉంటుంది.
ఈ సీవరేజీ వసూలు చేసే కంపెనీలు అన్నీ వైసీపీ నేతలు.. వారి బినామీలవే. తెలంగాణ మంత్రి పొంగులేటికి చెందిన కంపెనీకి మూడు జిల్లాల బాధ్యతలిచ్చారు. పెద్దిరెడ్డి కంపెనీ అమిగోస్ కు మరో రెండు జిల్లాలు … ఇతర వైసీపీ నేతలక సన్నిహితుల కంపెనీలకు ఇతర జిల్లాలు ఇచ్చారు. వీరంతా తమ బాధ్యత సమక్రంగా నిర్వర్తించారు. డబ్బులు వసూలు చేశారు. వైసీపీ కోసం ఎన్నికలకు సర్దుబాటు చేశారు. మరి ప్రభుత్వానికి ఎవరు కడతారు ?
వైసీపీ ప్రభుత్వమే వచ్చి ఉంటే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. అందుకే ఆ కంపెనీలన్నీ ఇప్పుడు డబ్బులు కట్టాల్సి వస్తోంది. పరువు పోతుందని.. లోతుగా తవ్వితే మొత్తానికే మోసం వస్తుందని.. పొంగులేటి కంపెనీలు హడావుడిగా ఆరు నెలల బకాయిలు.. ఆరవై కోట్లు కట్టేసింది. ఈ కంపెనీ అటు జగన్ పార్టీకి ఎన్నికల్లో ఖర్చు పెట్టి.. ఇప్పుడు తిరిగి ప్రభుత్వానికి కట్టాల్సి వచ్చింది. ముందు ముందు పొంగులేటి కథ అంతా బయటకు వచ్చేలా తవ్వకాలు ఇప్పటికే జరుగుతున్నాయి.