ఆంధ్రప్రదేశ్లో వంద శాతం కొత్త మంత్రులు రాబోతున్నారని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించిన తర్వాత … ఆ ముహుర్తం ఎప్పుడు అన్న చర్చ ప్రారంభమయింది. నిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఇప్పటికే కసర్తతు కూడా ప్రారంభించారని దాదాపుగా పూర్తయిందని అంటున్నారు. సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించేలా ఇప్పటికే ఓ రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారని అంటున్నారు. ఇప్పుడు ఆ మంత్రులందర్నీ మానసికంగా మాజీ మంత్రులయ్యేందుకు సిద్ధం చేసే ప్రక్రియను అమలు చేయడం ప్రారంభించారని అందుకే మెల్లగా లీకులు బయటకు వస్తున్నాయంటున్నారు.
కొద్ది రోజుల నుంచి కరోనా కారణంగా మంత్రులు ఏడాదిన్నర పాటు పని చేయలేకపోయినందున పొడిగింపు గురించి సీఎం జగన్ ఆలోచిస్తున్నారన్న ప్రచారం వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. అయితే అది కరెక్ట్ కాదని బాలినేని ప్రకటనతోనే తేలిపోయింది. ఇప్పుడు సీఎం జగన్ కసరత్తు కూడా దాదాపుగా పూర్తి చేశారన్న లీక్ నేపధ్యంలో ఎప్పుడు కొత్త మంత్రులు వస్తారన్న చర్చ కూడా ఊపందుకుంది. సంక్రాంతి వరకూ చాన్సిస్తారని కొంత మంది చెప్పుకుంటున్నారు. అయితే అలాంటి చాన్స్ లేదని.. దసరా లోపే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తవుతుందన్న అభిప్రాయాన్ని కూడా కొంత మంది వినిపిస్తున్నాయి.
సీఎం జగన్కు ఏదీ నాన్చడం ఇష్టం ఉండదు. ఫటాఫట్ చేసేస్తారు. ఈ క్రమంలో వంద శాతం మంత్రులను మార్చడం ఖాయమని సమాచారం బయటకు తెలిసిన తర్వాత నాలుగైదు నెలల పాటు నాన్చే అవకాశం లేదని అంటున్నారు. ఒకవేళ అలాగే ఉంటే మటుకు ఆయన చాలా ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంది. మంత్రి పదవుల కోసం.. పదవుల్ని కాపాడుకునేందుకు ఇతర నేతలు చాలాచాలా విన్యాసాలు చేస్తారు. అలాంటి పరిస్థితుల వల్ల పార్టీ, ప్రభుత్వంతో పాటు జగన్ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే దసరాలోపే కొత్త కేబినెట్ రావొచ్చని అంచనా వేస్తున్నారు.