ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల కోసం.. కొత్తగా 28 కార్పొరేషన్లు పెట్టాలని నిర్ణయించారు. బీసీ కులాలన్నింటికీ.. విడివిడిగా ఒక్కో కార్పొరేషన్ పెడతామని ఆయన ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు.. మిగతా కార్పొరేషన్లను నెలాఖరులోగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్తగా సీఎం ఆదేశించినట్లుగా 28 బీసీ కార్పొరేషన్లు పెడితే.. మొత్తంగా 52అవుతాయి. అంతా బాగానే ఉన్నా.. అసలు కార్పొరేషన్లకు కొత్త అర్థాన్ని ఏపీ సర్కార్ చెబుతోంది. అన్ని నిధులను కార్పొరేషన్లకు కేటాయించడం.. వాటిని అమ్మఒడి, రైతు భరోసా, సామాజిక పెన్షన్లు వంటివాటికి మళ్లించడం.. కామన్‌గా జరిగిపోతోంది. దీంతో కార్పొరేషన్ల లక్ష్యం నెరవేరడం లేదు.
ప్రస్తుతం.. సంక్షేమ నిధుల ఖర్చులో భిన్నమైన లెక్కలు చెబుతోంది. తాము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు అమ్మఒడి, రైతు భరోసాతో పాటు.. రెగ్యులర్‌గా ఇచ్చే పథకాలైన సామాజిక పెన్షన్లు, రేషన్ బియ్యం సహా.. మొత్తం.. ఆయా వర్గాల సంక్షేమం కోసం కేటాయించినట్లుగా చెబుతోంది. అదంతా కార్పొరేషన్ల లెక్కల్లో వేస్తూ చెబుతోంది. కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ. రెండు వేల కోట్లు ఇస్తామని చెప్పి… ఈ పథకాల మొత్తం అందులో చూపడంతో.. అదనంగా ఒక్క రూపాయి కూడా ఆ కార్పొరేషన్‌కు దక్కని పరిస్థితి. ఇప్పుడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా.. ఆయా వర్గాలకు.,. ఇచ్చే పెన్షన్లు, రేషన్, అమ్మఒడి డబ్బులను ఆ కార్పొరేషన్ల ఖాతాలో చూపించి.. తాము మేలు చేస్తున్నామని చెప్పుకోవడానికి తప్ప.. మరో ఉపయోగడం ఉంది.
వాస్తవానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ సహా వివిధ రకాల కార్పొరేషన్లను ఏర్పాటు చేయడానికి కారణం.. ఆయా వర్గాలను ఆర్థికంగా ఉన్నత స్థితికి తెచ్చేందుకు ప్రయత్నించడం. ప్రభుత్వం అమలు చేసే పథకాలతో సంబంధం లేకుండా.. ఈ కార్పొరేషన్లకు బడ్జెట్ కేటాయిస్తాయి. ఆ బడ్జెట్ నుంచి.. ఆయా వర్గాల యువత.. ఆర్థికంగా నిలదొక్కుకునేలా.., స్వయం ఉపాధికి రుణాలివ్వడం దగ్గర్నుంచి అనేక విధాలుగా సాయం చేస్తారు. అయితే.. ప్రస్తుతానికి ఆయావర్గాలు స్వయం ఉపాధి పొందడానికి ఎలాంటి సాయమూ ప్రభుత్వం చేయడం లేదు. అమ్మఒడి డబ్బులు.. రైతు భరోసా డబ్బులనే.. కార్పొరేషన్ సాయం కింద చూపిస్తోంది. దీంతో.. అసలు లక్ష్యం దెబ్బతింటోంది. రాజకీయం మాత్రం జోరుగా నడుస్తోంది.