ఒక్కమాట సీఎం జగన్ ను ఉలిక్కిపడేలా చేసింది. ఒకే ఒక్క మాట పులివెందుల గడ్డపై జగన్ ను ఓటమి అనుమానాన్ని రుచి చూపించినట్లు ఉంది. ఎన్నికల్లో జనం మూడు పక్కగా తెలిసిన జగన్… పులివెందులలో షర్మిల స్పీచ్ తో అలర్ట్ అయ్యారు.
అవును… శుక్రవారం షర్మిల పులివెందుల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వివేకా కూతురు సునీతతో కలిసి ప్రచారం నిర్వహించారు. వైసీపీ క్యాడర్ నుండి కొంత ప్రతిఘటన ఎదురైనా షర్మిల ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు. పోటాపోటీ ప్రచారంతో కడపలో పరిస్థితులు వేడెక్కుతున్న సందర్భంలో షర్మిల తన మాటలకు మరింత పదును పెట్టడంతో పాటు సెంటిమెంట్ ను స్టార్ట్ చేశారు.
మీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ… మీ వైఎస్ వివేకానంద రెడ్డి బిడ్డతో కలిసి వచ్చి ఆడబిడ్డగా కొంగుచాపి అడుగుతోంది. ఈ ఎన్నికల్లో హంతకులను ఓడించి, షర్మిలకు ఓటేయ్యమని అని. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మాటల ప్రభావం చాలా ఎక్కువ.
అంతే, ఉదయం లేచే సరికి జగన్ తన మేనత్తను రంగంలోకి దించారు. వైఎస్ రాజశేఖరెడ్డి నలుగురు అన్నదమ్ములకు ఒకే ఒక్క ఆడపడుచు విమలమ్మ. ఆమె మొదటి నుండి జగన్ కు, అవినాష్ కు సపోర్ట్ చేస్తూ వస్తుంది. నేను మీ మేనత్తను… వైఎస్ కుటుంబానికి ఆడపడుచును. వివేకం అన్న, రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్రేమించే సోదరిని. నేను చెప్తున్నా ఆ కుటుంబాన్ని పలుచన చేయవద్దని, మీ ఇద్దరూ ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లి చేస్తున్న విమర్శలు చాలు… ఇక నోరు మూసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు, పులివెందుల, కడప ప్రజలకు జగన్, అవినాష్ కు అండగా ఉండాలని కోరింది. నిజానికి ఈ మొత్తం ఎపిసోడ్ లో విజయమ్మను ఇన్వాల్స్ కావాలని జగన్ అండ్ కో కోరినా… షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడలేక అలాగని జగన్ విజ్ఞప్తిని కాదనలేకే విజయమ్మ అమెరికా వెళ్లిపోయిందన్న చర్చ సాగుతోంది.
షర్మిల ప్రచారం దెబ్బతోనే జగన్, అవినాష్ లు మేనత్త సహయం కోరారని… రాబోయే రోజుల్లో షర్మిల దూకుడు పెంచితే మరింత గడ్డుకాలం తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.