ఎపి శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యూహరాహిత్యం కొట్టవచ్చినట్టు కనిపించింది. అమరావతిలో భూముల కొనుగోలు వ్యవహారంపై సాక్షిలో వచ్చిన కథనాలకు సంబంధించిన కాగితాలను ఆయన మరో రూపంలో సభకు సమర్పించి వుండొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ చేస్తున్నానన్నప్పుడు ఏవో కొన్ని కాగితాలను ఇచ్చి విచారణ ప్రారంభిస్తే మరిన్ని అందిస్తానని చెప్పొచ్చు. దానికి బదులు సిబిఐ విచారణ అని మాత్రమే పట్టుపట్టడం ద్వారా ప్రతిపక్షం తన దగ్గర లోపం వున్నట్టు వ్యవహరించింది. సిబిఐ దర్యాప్తు అన్నది రాజకీయ నిర్ణయమే తప్ప సభలో నిర్ణయించదగింది కాదు. ప్రభుత్వం అందుకు అంగీకరించకపోతే ప్రతిపక్షం నేరుగా సిబిఐకి లేఖ రాయొచ్చు.కోర్టులో కేసు వేయొచ్చు. మీడియా ముందు వుంచొచ్చు.ఇవేవీ చేయకుండా కేవలం సిబిఐ వాదన దగ్గరే వైసీపీ ఆగిపోయింది. ఈ లోగా చర్చల్లో కలిసిన వైసీపీ సభ్యులు నిజంగా తమ నాయకుడు అలా చేసి వుండకూడదని అభిప్రాయం వెలిబుచ్చారు. కాని గవర్నర్ ప్రసంగం సమయంలో ఆ విధంగా జరిగిందనుకుంటే అవిశ్వాస తీర్మానం సమయంలోనూ అదే పునరావృతమైంది. ఈ క్రమంలో చంద్రబాబు మొన్నటి వైఖరినే పునురుద్ఘాటించడం, జగన్పై కోర్టుల వ్యాఖ్యలను చదివి వినిపించడం చూశాం. ఇందుకు సమాధానంగా జగన్ మరింత తీవ్రమైన ఆరోపణలుచేశారు. చంద్రబాబు వ్యవస్థలను ప్రభావితం చేయడం, పలుకుబడితో దర్యాప్తులు జరక్కుండా అడ్డుకోవడం, కావలసిన జడ్జిమెంట్లు తెప్పించుకోవడం జరిగిందని ఆరోపించారు. ఇక దాంతో న్యాయవ్యవస్థను అవమానించారని సభ చర్చ మొత్తం ఆ చుట్టే తిప్పింది టిడిపి.దానిపై జగన్ యుక్తియుక్తంగా విచారం వెలిబుచ్చి వుంటే కొంత బావుండేది. దానికి నిరసనగా నోరు జారిన మంత్రి అచ్చెం నాయుడు మాట వెనక్కు తీసుకున్నారు గాని జగన్ కాస్తయినా సర్దుకోవడానికి సిద్ధపడలేదు. తీర్పులను కూడా విమర్శించవచ్చని పేర్కొన్నారు.ఒకానొక నిర్దిష్ట తీర్పును విమర్శించడం వేరు. న్యాయవ్యవస్థ స్వభావాన్ని విమర్శించడం వేరు. పలుకుబడి తీర్పులు తెప్పించుకోవడం వంటి పదాలు వాడటం వేరు. అయితే షరా మామూలుగా అధికార పక్షం కూడా కావలసినంత సమయం వృథా అయ్యాక దానిపై క్షమాపణలకు పట్టుపట్టకుండానే అవిశ్వాసం వీగిపోయినట్టు ప్రకటింపజేసి బడ్జెట్ చర్చకు ముందుకు కదిలింది. ఒకవిధంగా మొన్నటి సీన్ రిపీట్ అయ్యింది. అవిశ్వాసం వృథాగా ముగిసింది.