అధికారంలోకి రావడానికి సీఎం జగన్ అసలు ఇంటికి వెళ్లకుంండా పాదయాత్రలు చేశారు. దీక్షలు చేశారు. ఎప్పుడూ ప్రజల్లో ఉన్నానని అనిపించుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక.. ఆయన అసలు బయటకు రావడమే మానేశారు. నాలుగేళ్లయింది. బటన్ నొక్కడానికి ఎప్పుడైనా బయటకు వస్తే పరదాలతో పయనిస్తున్నారు. ప్రజల్ని కలుసుకునే ప్రయత్నమే చేయడం లేదు. కానీ ఎన్నికలకు ముుందు ఆయనకు ప్రజలు గుర్తుకొస్తున్నారు. విపక్షాలన్నీ ప్రజల్లోకి వెళ్తున్నందున తాను వారికి దూరంగా ఉన్నానన్న భావన రాకుండా బస్సు యాత్ర చేసి.. పల్లె నిద్ర చేయాలన్న ఆలోచన చేస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
పరిస్థితి బాగోలేదని గుర్తించిన ఐ ప్యాక్ టీం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిందని అంటున్నారు. అసెంబ్లి బడ్జెట్ సమావేశాల తరువాత సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహించాలని అనుకుంటున్నారు.
బస్సు యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో పర్యటిస్తూ ప్రతి రోజూ ఏదో ఒక గ్రామంలో పల్లె నిద్ర చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో పల్లె నిద్ర చేసే సందర్భంలో రచ్చబండ కార్యక్రమాలను కూడా నిర్వహించాలని యోచిస్తున్నారు. గతంలోనే రచ్చబండ నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కానీ అది ప్రచారానికే పరిమితమయింది. ఇంతవరకూ ప్రారంభం కాలేదు. అయితే, కోవిడ్ తదితర కారణాలవల్ల రచ్చబండ కార్యక్రమం కొంత జాప్యం జరిగింది. చివరి ఆరేడు నెలలు ప్రజల్లో ఉండేలా జగన్ కార్యక్రమాలు ఖరారవుతాయి.
జగన్ పర్యటనలకు వస్తే ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. ఆయనో మహారాజు.. ఆయన వస్తే దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు ఉండాలన్నట్లుగా పరిస్థితిలు ఉంటాయి. ఇలాంటి వాటిని భరించడం పార్టీ నేతలకూ సిద్ధం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగితే మైనస్ అవుతుంది కానీ ప్లస్ కాదన్న వాదన ఎక్కువగా ఆ పార్టీలోనే వినిపిస్తోంది. పైగా ఇప్పుడు వెళ్తే.. ఇప్పుడు గుర్తొచ్చామా అని ప్రజలు నిలదీసే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే బస్సు యాత్ర.. పల్లెనిద్ర ఉత్త ప్రచారమేనని.. జగన్ ఎన్నికల ప్రచారానికి తప్ప బయటకు రారన్న నమ్మకం మరో వర్గం వైసీపీ క్యాడర్ లో ఉంది.