తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గత వారం రోజుల నుంచి ఫీల్డ్లోనే ఉన్నారు. వర్షాల దెబ్బకు అతలాకుతలమైపోతున్న జనాన్ని ప్రత్యక్షంగా ఆదుకోవడానికి ఆయన నేరుగా ఫీల్డ్లోనే ఉంటున్నారు. ప్రజలకు అందుకున్న ఆహారం గురించి … సౌకర్యాల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ విషయాలను తెలుగువాళ్లు కూడా పోస్టులు పెట్టి అభినందిస్తున్నారు. కానీ తమిళనాడుతో పాటు దారుణంగా వర్షాలకు ఎఫెక్ట్ అవుతున్న జిల్లాలు నెల్లూరు, చిత్తూరు. అక్కడకు ఏపీ ప్రభుత్వం వైపు నుంచి వెళ్లిన వారు.. ఒక్కరూ లేరు.
ముఖ్యమంత్రి జగన్ అమరావతిలో సమీక్ష చేసి.. తక్షణం రూ. వెయ్యి బాధితులకు ఇవ్వాలని…బాధితులకు ఏం కావాంటే అది ఇవ్వాలని ఆర్డర్స్ పాస్ చేసేశారు. ఇంత వరకూ ఆయన ఇలాంటి ఆదేశాలు కొన్ని వందలు ఇచ్చి ఉంటారు.. కానీ ఎక్కడైనా అమలయ్యాయో లేదో ఎవరికీ తెలియదు. ఏ ప్రకృతి విపత్తు వచ్చినా ఇలాంటి ప్రకటనలు ఇస్తూ ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత రెండు, మూడు రోజులకు హెలికాఫ్టర్లో విహంగ వీక్షణం చేస్తారు. ఎప్పుడూ క్షేత్ర స్థాయిలో పర్యటించిన సందర్భం లేదు. ఇప్పుడు కూడా ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటనకు వెళ్లే అవకాశాలు కల్పించడం లేదు.
ఇంకా పరిస్థితి తీవ్రంగా ఉంటే విహంగ వీక్షణం చేస్తారేమో…? పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైనా అలా తిరిగితే గొప్ప గొప్ప పోస్టులు పెడతారు కానీ.. సొంత రాష్ట్రంలో సీఎం ఇళ్లు కదలకపోయినా ప్రశ్నించే వారు ఉండరు. ప్రశ్నించినా బూతులు తిట్టే వారు ఎక్కువే ఉంటారు. ఇక్కడ రాజకీయం అంతా డామినేట్ చేస్తోంది. బాధితుల్ని ఆదుకోకపోయినా ప్రశ్నించడానికి భయపడే పరిస్థితి వచ్చింది. అందుకే పొరుగు రాష్ట్రాల సీఎంలను చూసి.. ఆహా ఒహో అనుకుని సంతృప్తి పడే పరిస్థితి వచ్చింది.