నియోజకవర్గాల సమీక్షలు ప్రారంభిస్తానని జగన్ హడావుడి చేశారు. ఆ చివరన ఉన్న కుప్పం..ఈ చివరన ఉన్న రాజాం నియోజకవర్గ కార్యకర్తలతో వరుసగా రెండు రోజుల పాటు అయ్యాయి. అంతే.. ఆ చివర.. ఈ చివర చర్చించాను కాబట్టి ఇక అవసరం లేదనుకున్నారేమో కానీ మర్చిపోయారు. కానీ ఈ రెండు నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు చెప్పిన సమస్యలు విన్న తరవాతే జగన్.. ఇక అలాంటి సమావేశాలు వద్దని డిసైడైనట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
పిలిచించి యాభై మందినే అయినా సమస్యల ఏకరవు !
కుప్పం, రాజాం నియోజకవర్గల నుంచి ఎంపిక చేసిన యాభై మంది కార్యకర్తలతో జగన్ సమావేశాలు నిర్వహిచారు. కరుడుగట్టిన వైసీపీ నేతలు..అదీ కూడా వైసీపీ పాలనలో పదవులు పొందిన వారు.. ఆర్థికంగా లాభం పొందిన వారినే ఎంపిక చేసి సమావేశానికి తీసుకొచ్చారు. సమావేశం ముందు వారికి చెప్పాల్సినవి చెప్పారు. పార్టీకి నష్టం చేసేలా నెగెటివ్ ఏమీ చెప్పవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ రెండు సమావేశాల్లోనూ .. ఆ ముఖ్యమైన యాభై మంది కార్యకర్తలు.. అభివృద్ధి పనులు.. బిల్లులు.. రోడ్లు.. పథకాల్లో కోతలను ప్రస్తావించారు. ఇది మీడియాలో హైలెట్ అయింది . దీంతో ఆ రెండు నియోజకవర్గాల తర్వాత జగన్ ఇతర నియోజకవర్గాలపై సమీక్షలు చేయడానికి సమయం కేటాయించడం లేదు .
కార్యకర్తలతో మాట్లాడితేనే సమస్యలు తెలిసేది !
వైసీపీ పదేళ్ల పాటు స్వచ్చందంగా పని చేసిన కార్యకర్తలే బలం. గత ప్రభుత్వం రాజకీయంగా ప్రస్తుత ప్రభుత్వం చేసినట్లుగా వైసీపీ నేతలను టార్గెట్ చే్యలేదు కానీ.. ఆర్థికంగా వారికి ఎలాంటి ప్రయోజనాలూ దొరికే చాన్స్ లేదు. అయినప్పటికీ కార్యకర్తలు ఖర్చు పెట్టుకుని పార్టీని నడిపించారు. అధికారలోకి వచ్చాక వారి గురించి జగన్ ఆలోచించాల్సి ఉంది. కానీ వారిని మరింత ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యే స్థాయి నేతలు బాగుపడినా కింది నేతలు మాత్రం పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయారు. అందుకే అనేక మంది ఎమ్మెల్యేలు.. తమ క్యాడర్‌కు బిల్లులు రావాల్సి ఉందని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు చేయగలిగింది కూడా ఏమీ లేదు.
సమస్యలు వినకుండా లేవనుకుంటే నిప్పులపై దుప్పటి కప్పుకోవడమే !
జగన్ సమస్యను వినడానికి ఆసక్తి చూపించడం లేదు. ఆయనను ఆఆయన చుట్టూ ఉండే కొంత మంది నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని… సమస్యలేమీ లేవని చెబుతున్నారని..దాన్నే జగన్ నమ్ముతున్నారని వైసీపీలోని కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సమస్యలు వినడానికి కార్యకర్తలకు అవకాశం ఇవ్వడం లేదనుకుంటన్నారు .అయితే సమస్యలు తెలుసుకోకుండా… ఏమీ లేవనుకుంటే.. నిప్పులపై దుప్పటి కప్పుకున్నట్లేనని.. ఆ పార్టీ ద్వితీయశ్రేణి నేతలు పార్టీ హైకమాండ్‌ను హెచ్చరిస్తున్నారు.