2014 ఎన్నికల తర్వాత నుంచీ కూడా చంద్రబాబు-జగన్‌లు ఒక రాజకీయ సిద్ధాంతాన్ని చాలా గట్టిగా ఫాలో అవుతున్నారు. 2014 ఎన్నికలకు ముందు వరకూ జగన్ మాత్రమే ఆ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేవాడు. ఎన్నికల తర్వాత …మరీ కరెక్ట్‌గా చెప్పాలంటే ఓటుకు కోట్లు కేసు తర్వాత నుంచీ చంద్రబాబు కూడా అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాడు. ‘చంద్రబాబు ఒక్కడే శతృవు-మిగతా అందరూ కూడా మిత్రులే’ అనే సిద్ధాంతం జగన్‌ది. ఓటుకు కోట్లు కేసు తర్వాత నుంచీ ‘జగన్ ఒక్కడే శతృవు-మిగతా అంతా మిత్రులు’ అనేది చంద్రబాబు సిద్ధాంతం అయిపోయింది. అంతా కూడా కోర్టు కేసులు, అవినీతి, అక్రమ వ్యవహారాల భయం అని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. రాజకీయంగా ప్రత్యర్థిని దెబ్బతీయడం…తాను అధికారంలోకి రావడం అనే ఒకే ఒక్క సిద్ధాంతంతో పనిచేస్తున్న నాయకులే కాబట్టి ఇద్దరికీ కూడా ఈ సిద్ధాంతం కరెక్ట్‌గానే సూట్ అవుతుంది అనిపిస్తుంది. కానీ ఈ సిద్ధాంతంలో కూడా చాలా పెద్ద ప్రమాదం ఉంది అని ఇప్పుడు వైఎస్ జగన్‌ని చూస్తే తెలుస్తోంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ, అంతకుముందు కూడా టిడిపిని తెలంగాణాలో నుంచి ఊడ్చిపారెయ్యడమే టార్గెట్‌గా పనిచేశాడు టీఆర్ఎస్. 2014కి ముందు ఎలా ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ మాత్రం టిడిపి నాయకులను, ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి చేర్చుకుని తెలంగాణాలో టిడిపి ఉనికినే ప్రశ్నార్థకం చేసేశాడు కెసీఆర్. టిడిపి ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి లాక్కుని…అన్ని విలువలకూ పాతరేస్తూ…తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకు మంత్రి పదవులు కట్టబెట్టేశాడు. గవర్నర్ కూడా సై అనేశాడు. ఆ టైంలో చంద్రబాబునాయుడితో పాటు టిడిపి నాయకులు, ఆ పార్టీ భజన మీడియా అంతా కూడా గగ్గోలెత్తిపోయింది. కెసీఆర్ తప్పును ఎంతలా ఎత్తిచూపాలో అంతా చూశారు. దేశవ్యాప్తంగా కెసీఆర్ తప్పు చర్చనీయాంశం అయ్యేలా చేశారు.
ఈ మొత్తం వ్యవహారంపై దేశంలో ఉన్న చాలా మంది నాయకులు స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులందరూ ఏదో ఒక విధంగా స్పందించారు. కానీ ఒక్క వైఎస్ జగన్ మాత్రం లైట్ తీసుకున్నాడు. వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిని కూడా కెసీఆర్ లాగేసుకున్నప్పటికీ జగన్ మాత్రం పెద్దగా విమర్శించింది లేదు. ఇక టిడిపి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం విషయంపై మాత్రం అస్సలు స్పందించలేదు. అప్పటికి ఆ వ్యూహం బాగానే ఉంది అనుకున్నా….అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు ఆ పార్టీ నాయకులకు తెలిసొస్తోంది. తలసాని శ్రీనివాసయాదవ్ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడే వైఎస్ జగన్ స్పందించి ఉంటే…వైకాపా నాయకులు కూడా కెసీఆర్ తప్పును నిలదీసి ఉంటే టిడిపి నాయకులు కూడా గొంతు కలిపేవారు. చంద్రబాబుకు ప్లస్ అయ్యే అంశమే కాబట్టి ఆ టాపిక్ వరకూ మాత్రం టిడిపి మీడియాలో కూడా వైకాపా నాయకుల గొంతు గట్టిగా వినిపించేది. అదే జరిగి ఉంటే ఇప్పుడు చంద్రబాబు చేసిన తప్పు ఇంకా హైలైట్ అయ్యి ఉండేది. టిడిపి ఎమ్మెల్యేను లాక్కుని మంత్రిని చేసేసిన కెసీఆర్‌పై ఉద్యమ స్థాయిలో విరుచుకుపడ్డాడు చంద్రబాబు. ఆ టైంలో జగన్ కూడా చంద్రబాబుకు సపోర్ట్ చేసి ఉంటే….ఇప్పుడు వైకాపా ఎమ్మెల్యేలను లాక్కుని మంత్రి పదవులను కట్టబెట్టే సాహసం చంద్రబాబు చేసి ఉండేవాడు కాదేమో. ఒకవేళ చేసి ఉన్నా చంద్రబాబుకు వచ్చే చెడ్డపేరు ఇంకా ఎక్కువ ఉండేది. అందుకే మరి….కళ్ళ ముందు తప్పు జరుగుతూ ఉంటే తప్పకుండా ఖండించాలిరా అని పెద్దలు చెప్పేది. రాజకీయాలకు కూడా ఈ నీతి వర్తిస్తుందని ఇప్పుడు జగన్ పాఠంతో అయినా అందరికీ అర్థమవుతుందేమో చూడాలి.