నంద్యాల ఉప ఎన్నిక వైఫల్యం అనంతరం వైకాపా ప్రారంభించిన కార్యక్రమం ‘వైయస్సార్ ఫ్యామిలీ’. రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లోనూ ప్రతీ ఇంటికీ వెళ్లాలనీ, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పొందిన లబ్ధిని ప్రజలకు గుర్తు చేయాలని సంకల్పించారు. వారితోపాటు వైకాపా అభిమానులందరినీ ఫ్యామిలీలో చేర్చాలంటూ నేతలకు జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏతావాతా ఈ కార్యక్రమం ద్వారా వైకాపాకు బలమైన ఓటు బ్యాంకు సృష్టించుకోవాలనేది జగన్ లక్ష్యం. అయితే, ఈ కార్యక్రమ స్పందనపై ఇప్పుడు జగన్ కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఆశించిన స్థాయిలో స్పందన లేదనీ, ఫ్యామిలీలో చేరిన సభ్యుల సంఖ్య సరిపోదని ఆగ్రహం వ్యక్తం చేశారట. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలోనూ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ స్పందన మరీ తక్కువగా ఉండటంపై జగన్ ఆశ్చర్యపోయినట్టు సమాచారం. ఇదే సమయంలో ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులకు క్లాస్ తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
పనితీరు సరిగా లేని నేతల విషయమై క్లాసులు తీసుకోవడం, శిక్షణలు ఇవ్వడం లాంటివి మామూలే. అయితే, ప్రతిపక్ష పార్టీలో అసలు సమస్య ఎక్కడ ఉందంటే… చేపట్టబోయే కార్యక్రమం ఏదైనా సరే, దానికి అనుగుణంగా కింది స్థాయి నాయకుల్ని సిద్ధం చేసే తీరు సరిగా ఉండదని చాలామంది అంటుంటారు! జగన్ కు ఏదో ఒక ఆలోచన తట్టగానే, దాన్ని వెంటనే అమలు అని ప్రకటించేస్తారనీ, సమయం ఏమాత్రం ఇవ్వరని చెబుతుంటారు! దాని సాధ్యాసాధ్యాలపైగానీ కార్యాచరణపైగానీ విధివిధానాలపైగానీ విస్తృత చర్చకు ఆస్కారం తక్కువ అనే అభిప్రాయం చాన్నాళ్ల నుంచే ఉంది. ఇప్పుడీ ‘వైయస్సార్ ఫ్యామిలీ’ కార్యక్రమ స్పందనపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. నిజానికి, ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు కావాల్సిన విధంగా నాయకులను పార్టీ తరఫున ముందుగానే సంసిద్ధ పరచారా అనేది ప్రశ్నించుకోవాలి.
నంద్యాల ఓటమి అనంతరం దానిపై సమగ్ర విశ్లేషణ జరగలేదని ఆ పార్టీ నేతలే కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కథనాలు వచ్చాయి. అధికారం, డబ్బు దండిగా ఉండటంతోనే నంద్యాలలో టీడీపీ గెలిచిందని సరిపెట్టుకున్నారుగానీ, అంత భారీ స్థాయిలో మెజారిటీ ఎందుకు వచ్చిందీ, వైకాపా వ్యూహాలు ఎక్కడ బెడిసికొట్టాయనే చర్చకు ఆస్కారం లేకుండా… హుటాహుటిన ఈ ‘వైయస్సార్ ఫ్యామిలీ’ కార్యక్రమం జగన్ మొదలుపెట్టారు. పార్టీ వర్గాలన్నీ నంద్యాల ఓటమితో నిరాసక్తంగా ఉంటే, కొత్త కార్యక్రమం తీసుకొచ్చి వారిపై పెట్టారు. తేదీలను ప్రకటించేశారు, లక్ష్యాలు నిర్దేశించేశారు! ఆవేశంగా ప్రసంగించేశారు. ఫలితం.. ఇవాళ్ల జగన్ వ్యక్తం చేస్తున్న అసంతృప్తి!
ఇక, బొత్స, ధర్మానలపై ఆగ్రహం వ్యక్తం చేయడం విషయానికొస్తే… ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ ఇద్దరు నేతలకూ ఏమంత పట్టు లేదు. కాంగ్రెస్ లో ఉండగానే విజయనగరం జిల్లాలో బొత్సపై చాలా వ్యతిరేకత వ్యక్తమైంది. అధికారం చేతిలో ఉందన్న ధీమాతో ఆయన అనుచరగణం చేసిన వీరంగాలతో ప్రజలు విసిగిపోయారు. వైకాపాలో చేరినంత మాత్రాన బొత్సా అంటే జయహో అని కదిలి వచ్చేందుకు సిద్దంగా ఉన్నవారు విజయనగరం జిల్లాలో తక్కువే అని చెప్పాలి. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావుపై కూడా దాదాపు ఇలాంటి వ్యతిరేకతే ఉంది. వీరిద్దరూ ఇన్నాళ్లూ పెద్దగా జనంలోకి వెళ్లకుండా కాలాన్ని నెట్టుకొచ్చారు. ఇప్పుడు వైయస్సార్ ఫ్యామిలీ అని వెళ్లినంత మాత్రాన.. ప్రజాభిమానం అనూహ్యంగా వారిపై వ్యక్తం కాదు కదా! ఆ ఇద్దరు నేతల పనితీరూ బాగులేకపోవడం వెనక వాస్తవం ఇదీ. ఇద్దరికీ క్లాస్ తీసుకున్నంత మాత్రాన ఇది పరిష్కారం కాదనేది విశ్లేషకుల అభిప్రాయం.