ముఖ్యమంత్రి జగన్ ఆర్భాటంగా ప్రారంభించిన జగనన్నకు చెబుతాం ప్రోగ్రాం గురించి ఒక్క సక్సెస్ స్టోరీని కూడా ప్రభుత్వం లేదా ఐ ప్యాక్ ప్రచారం చేసుకోలేకపోతోంది. మామూలుగా ఐ ప్యాక్ స్ట్రాటజీ భిన్నంగా ఉంటుంది. ఈ రోజు కాల్ చేయగానే జగనన్న పరిష్కరించాలంటూ ఓ సమస్యను వైరల్ చేస్తుంది. ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుందని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అలాంటిదేమీ జరగడం లేదు. కాల్ సెంటర్ కు వస్తున్న కాల్స్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు.
పరిష్కరిస్తారన్న నమ్మకం లేక ఫోన్లు చేయని జనం
ఇంతకు ముందు ప్రభుత్వం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో స్పందన లేదని ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారు. సీఎంను కలిసే అవకాశం లేకపోవడం ఆయన ప్యాలెస్ లో మాత్రమే ఉంటూండటంతో .. సమస్యలపై ఎవరికి చెప్పుకోవాలో తెలియని దీన స్థితికి జనం వెళ్లిపోయారు. ఈ అసంతృప్తిని గమనించి జగనన్నకు చెబుతాం అనే కార్యక్రమం పెట్టారు. కానీ ఇదంతా ఫార్స్ అని తొలి రోజే తేలిపోయింది. అందుకే ప్రజలు కూడా కాల్స్ పెద్దగా చేయడం లేదని చెబుతున్నారు.
ఫిర్యాదు చేశారని తెలిస్తే వేధింపులుంటాయని భయం
పరిష్కరిస్తారన్న నమ్మకం లేకపోవడం ప్రధాన కారణం అవడం వల్ల ఎక్కువ మంది ఫిర్యాదులకు కూడా సాహసించడం లేదని చెబుతున్నారు. అదే సమయంలో తాము ఫిర్యాదు చేశామని తెలిస్తే.. రకరకాలుగా వేధింపులకు గురి చేస్తారని.. ఇప్పుడు అలాంటివి అవసరమా అనుకునే పరిస్థితుల్లో ఉన్నారు. పోలీసులు బాధితుల వైపు ఉండటం లేదు.. నిందితులవైపే ఉంటున్నారు. అది వైసీపీ వారు నిందితులయితే రక్షణ కూడా కల్పిస్తున్నారు.
వస్తున్న కాల్స్ కూడా ప్రభుత్వంపై ఫిర్యాదులకే !
మరో వైపు వస్తున్న కాల్స్ గురించి కూడా ప్రభుత్వం బయట పెట్టడం లేదు. ఇలా వస్తున్న కాల్స్ లో అత్యధిక ఫిర్యాదులు ప్రభుత్వంపైనే ఉంటున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం, సంక్షేమ పథకాలను అడ్డగోలు కారణాలు చెప్పి ఆపేయడం వంటి అంశాలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తూండటంతో ఆ వివరాలు బయట పెట్టడం లేదని చెబుతున్నారు. అసలు వస్తున్న కాల్స్ ఏ సమస్యలకు సంబంధించినవో కూడా చెప్పడం లేదు. మొత్తంగా జగనన్నకు చెబుదాం అనేది ఓ ఫార్స్ ప్రయత్నంగా నిలిచిపోయిందని వైసీపీలోనూ అసహనం వ్యక్తమవుతోంది.