వారు వైసీపీ తరపున సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి పార్టీనో.. సొంత పార్టీలో ప్రత్యర్థుల్నో దెబ్బకొట్టడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్నారు. గెలిచారు. కానీ ఇప్పుడు వారికి అసలు సినిమా కనిపిస్తోంది. వీధిలైట్ పాడైపోతే బాగుచేయంచడానికి నిధులు ఉండటం లేదు. పంచాయతీలకు రాష్ట్రం ఇవ్వకపోతే ఏమయింది కేంద్రం నుంచి నిధులు వస్తాయి కదా అని వారు ధీమాగా ఎన్నికల్లో పోటీ చేశారేమో కానీ ఇప్పుడు ..రాష్ట్రం ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చే నిధులు కూడా కరెంట్ బిల్లుల పేరుతో ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు. దీంతో వైసీపీ సర్పంచ్ల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది.
ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు రూ. ఇరవై లక్షల వరకూ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇప్పటి వరకూ రూపాయి ఇవ్వలేదు. ఏకగ్రీవం అయితే డబ్బులు వస్తాయి కదా అని గ్రామాల్లో చాలా చోట్ల వేలం పాటలు నడిచాయి. ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా మడమ తిప్పేసింది. ఒక్క రూపాయి కూడా ఇచ్చే అవకాశం లేదని చెబుతోంది. దీంతో మరింత మనిగిపోయింది. గ్రామాల్లో పనులు చేయించి.. బిల్లులు పెట్టుకున్న వారు .. ఎదురు చూస్తూనే ఉన్నారు. వారు సహజంగానే వైసీపీ నేతలవుతారు. వారి ఒత్తిడి కూడా పెరిగిపోయింది.
ఏం చేయాలో తెలియక పార్టీ గురించి కూడా పట్టించుకోకుండా రోడ్డు మీదకు రావాలని.. సర్పంచ్‌లు డిసైడయ్యారు. భారీ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. అయితే ఎంత చేసినా ఇప్పటికిప్పుడు జగన్ చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే ఎంత అప్పులు పుట్టినా… ఖర్చులకు సరిపోవడం లేదు. ఎన్ని అప్పులు చేసినా.. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సినవి ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వాటిని అప్పు రూపంలో తీసుకోవడం లేదు. కరెంట్ బిల్లుల రూపంలో తీసుకుంటున్నారు. అందుకే సర్పంచ్‌లు వైసీపీ వారైనా సరే.. ఆశలు వదులుకోవాల్సిందే.