ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలన్న కేంద్రం నిర్ణయాన్ని జగన్ అడ్డుకున్నారు. ఈ విషయన్ని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు పార్లమెంట్లో తెలిపారు. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల్ని పెంచారు. దానికి కేసీఆర్ ఆమోదం తెలిపారు. అదే సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల్ని పెంచడానికి ప్రతిపాదన ఏపీ ప్రభుత్వానికి వచ్చింది. కానీ జగన్ మాత్రం వద్దే వద్దన్నారు. హైకోర్టులో న్యాయమూర్తులు పెరిగితే జగన్కు వచ్చే నష్టమేంటో కానీ ఆయన మాత్రం వద్దనేశారని కేంద్రం నేరుగానే ప్రకటించింది.
హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరిగితే కేసులు సత్వరం పరిష్కారం అవుతాయి. బడుగుల, బలహీనవర్గాల్లో ప్రతిభావంతులైన వారికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. కానీ జగన్ మాత్రం కేసులు త్వరగా పరిష్కారమయ్యే అవకాశాలను.. న్యాయమూర్తులుగా బడుగు, బలహీనవర్గాలు ఎన్నికయ్యే గొప్ప అవకాశాలను కారణం తెలియని వ్యతిరేకత ద్వారా తోసి పుచ్చారు. నిజానికి దేశంలో ఏ రాష్ట్రంలో అయినా న్యాయమూర్తుల సంఖ్య పెంచుతామంటే వద్దని చెప్పే ముఖ్యమంత్రులు ఉండరు. ఎందుకంటే వ్యాయం వేగంగా జరగాలని అన్ని ప్రభుత్వాలు కోరుతాయి.
కానీ ఏపీలో మాత్రం దానికి భిన్నంగా జరుగుతుంది. న్యాయమూర్తుల నియామకాలు వద్దంటారు. న్యాయవ్యవస్థపై దాడిచేస్తారు. కోర్టు తీర్పులను పట్టించుకోరు. అన్ని రకాల వ్యవస్థలను పక్కన పెడతారు. ఈ పరిస్థితి న్యాయనిపుణులను సైతం ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పుడు న్యాయమూర్తుల సంఖ్య పెంచుతామన్నా.. సీఎం వద్దన్న విషయం బయటకు తెలియడంతో.. సీఎం జగన్ ఆలోచనలు ఏమిటన్న దానిపై మరింత చర్చ జరుగుతోంది.