రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి. వైసీపీ మూడు సీట్లు గెలవగలదు. కానీ ఎమ్మెల్యేలందరూ ఓట్లు వేస్తేనే కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి బాగోలేదు. 70 మంది ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు. నాలుగు జాబితాల్లో ప్రకటించిన.. బదిలీ చేసిన.. టిక్కెట్ నిరాకరించిన వారు ఓటు వేస్తారన్న నమ్మకం లేదు. దళిత ఎమ్మెల్యేలను ఎక్కువగా బలి చేయడంతో వారు గుర్రుగా ఉన్నారు. నిజానికి మరో వంద నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపై కసరత్తు జరుగుతోంది. అధికారిక ప్రకటన ఆపేశారు. రాజ్యసభ ఎన్నికల వ్యవహారం తేలిన తర్వాత మిగతా ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
ఇక్కడే జగన్ రెడ్డి అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. మూడో ఓడిపోయే సీటు బీజేపీకి ఇచ్చేందుకు ప్రతిపాదించబోతున్నారు. ఈ ఆఫర్ ను స్వయంగా ఇచ్చేందుకు జగన్ రెడ్డి బీజేపీ పెద్దల వద్దకు వెళ్తున్నట్లుగా చెబుతున్నారు. అమిత్ షా అపాయింట్మెంట్ కోసం జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆయనకు అపాయింట్ మెంట్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఖరారు కాగానే జగన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారు. అక్కడ బీజేపీ నేతలతో చర్చలు జరిపి వారికి కావాల్సిన వ్యక్తిని రాజ్యసభకు పంపిస్తామని బేరమాడతారని అంటున్నారు.
జగన్ రెడ్డి బీజేపీతో సన్నిహిత సంబంధాలను కొనసాగించాలనుకుంటున్నారు ఆ పార్టీ నేతలు వచ్చి ఎన్ని విమర్శలు చేసినా వారిని ఏమీ అనరు. కానీ టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారిని మాత్రం విమర్శిస్తూంటారు. ఇటీవల తన సభ వద్ద బీజేపీ నేతల కటౌట్ కూడా పెట్టింటి పార్టీ నేతలతో తన్నించారు. అయితే ఆ కటౌట్ కు ఎవరి పోలికలు లేకుండా జాగ్రత్తపడ్డారు. కానీ కమలం గుర్తు వేశారు. ముందొక వ్యవహారం.. వెనుకొక వ్యవహారం జగన్ రెడ్డి నడుపుతున్నారని ఈ అంశంపై బీజేపీ నేతలు ఇప్పటికే గుర్రుగా ఉన్నట్లుగా చెబుతున్నారు.