జగన్మోహన్ రెడ్డి ఏ విషయం మీద ప్రసంగం చేసినా అది చంద్రబాబు నాయుడుని విమర్శించడంతోనే మొదలయ్యి చివరి వరకు ఆ విమర్శలతోనే సాగి ముగుస్తుంటుంది. అది చూసినప్పుడు రెండు కధలు గుర్తుకు వస్తుంటాయి. రెండూ చాలా మందికి తెలిసిన కధలే. ఒక విద్యార్ధికి ఆవు గురించి మాత్రమే బాగా తెలుసు. కనుక అతనిని దేని గురించి ప్రశ్నించినా చివరికి దానిని ఆవుతో లింక్ చేసి తనకు బాగా తెలిసిన ఆవు గురించి చెప్పి ముగిస్తుంటాడు. ఒకరోజు టీచర్ విద్యార్ధులు అందరినీ సముద్రం గురించి వ్యాసం వ్రాయమంటే మనోడు ‘సముద్రం దగ్గర ఆవు కనబడింది..దానికి నాలుగు కాళ్ళు ఉండును..ఆవు పాలిచ్చును..”అంటూ ముగించాడు. జగన్ ప్రసంగాలు కూడా ఇలాగే ఉంటాయి.
ఇంకా రెండోది హిరణ్యకశిపుడి కధ అందరికీ తెలిసిందే. అందులో ఆయన విష్ణుమూర్తిని అమితంగా ద్వేషిస్తుంటాడు. కానీ ఆయన కొడుకు ప్రహ్లాదుడే విష్ణుమూర్తి నామస్మరణ చేస్తుండటంతో తట్టుకోలేక అతనిని వధించడానికి కూడా ప్రయత్నిస్తుంటాడు. కానీ ప్రతీసారి విష్ణుమూర్తి అతనిని కాపాడుతుంటాడు. చివరికి ఆ విష్ణుమూర్తి చేతిలోనే హిరణ్యకశిపుడు చనిపోతాడు. ఈ కధలో ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఎంతగా ధ్యానం చేసాడో, హిరణ్యకశిపుడు కూడా విష్ణుమూర్తిని అంతగానే స్మరిస్తూనే చివరికి ఆ విష్ణుమూర్తి చేతిలోనే మోక్షం పొందాడు. అయితే కొడుకు భక్తితో స్మరిస్తే, తండ్రి ద్వేషంతో నిత్యం స్మరిస్తూనే ఉన్నాడు. అందుకే అతనికి సాక్షాత్ విష్ణుమూర్తి చేతిలోనే మోక్ష ప్రాప్తి కలిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా అచ్చు అలాగే నిత్యం చంద్రబాబు నాయుడు నామస్మరణ చేయకుండా ఉండలేరు. ఇక్కడ ఆయనకీ మోక్ష ప్రాప్తి కలగడం అంటే ముఖ్యమంత్రి కావడం అని అనుకోవలసి ఉంటుంది. పురాణాలలో ఈ విధానం వర్క్ అవుట్ అయ్యిందేమో కానీ వర్తమాన రాజకీయాలలో కూడా ఈ పద్ధతిలో ముఖ్యమంత్రి అవడం కష్టం. ఒకవేళ జగన్ కూడా మిగిలిన ఎమ్మెల్యేలతో పాటు తను కూడా తెదేపాలో చేరిపోయి చంద్రబాబు నాయుడు భజన చేసినా కూడా వేరే ఏదో మంత్రి పదవి దక్కవచ్చునెమో కానీ ముఖ్యమంత్రి పదవి దక్కదు.
డా.అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా జగన్ నిన్న చేసిన ప్రసంగంలో ప్రతీ రెండు వాక్యాలకి ఒకసారి చంద్రబాబు నాయుడుని స్మరించుకొంటూనే ఉన్నారు. అదేదో సినిమాలో “నా ప్రేమను కోపంగానో..నా ప్రేమను ద్వేషంగానో..ఫీల్ మై లవ్” అని పాడుతున్నట్లుంది జగన్ తీరు. డా. అంబేద్కర్ జయంతి రోజున ప్రసంగం అంటే ఆ మహనీయుడి గురించి నాలుగు మంచి ముక్కలు చెప్తారని అందరూ ఆశిస్తారు కానీ జగన్ ఆయన గురించి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుని తన ప్రసంగంలో ఏకి పారేశారు. అదెలాగ ఉంటుందో అందరూ చాలా సార్లు వినే ఉంటారు కనుక మళ్ళీ దాని గురించి చెప్పుకొనక్కరలేదు. చెప్పుకొన్నా ఏ ఉపయోగం ఉండదు.
చంద్రబాబు నాయుడు చేతిలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఓడిపోకపోయుంటే ఆయనే ముఖ్యమంత్రి అయ్యుండేవారేమో. కానీ అవలేకపోయారు. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయన ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని శాపాలు పెడుతూ సంతృప్తి పడుతున్నారు. ఎన్ని శాపాలు పెట్టినా తెదేపా ప్రభుత్వం పడిపోలేదు పైగా ఆ శాపాలు వికటించి ఇప్పుడు వైకాపాకే చేటు కలిగిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో తెదేపాను ఓడించి తను ముఖ్యమంత్రి అవగానే ప్రజలందరి కష్టాలు తీర్చేస్తానని జనాలని ఓదార్చుతున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పార్టీ ఖాళీ అయిపోతుండటంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఆయనకే ఓదార్పు అవసరమయింది. పనిగట్టుకొని అందరినీ ఓదార్చిన ఆయనని ఇప్పుడు ఓదార్చే వాళ్ళే లేరు. అందుకే ఆ ఆక్రోశం ఈవిధంగా బయటపడుతుంటుంది.