సీబీఐ- ఈ పదం రాజకీయంగా తమ ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టడానికి ప్రతి నాయకుడూ చాలా తరచుగా వాడుతూ ఉంటారు గానీ.. ఇదే పదం ఇప్పుడు విపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి ముందరి కాళ్లకు బంధం వేసేలాగా కనిపిస్తోంది. వైఎస్ జగన్ మరియు వైకాపా శ్రేణులు మొత్తం అమరావతి భూదందాలు వెలికి రావడం ప్రారంభం అయిన తర్వాత.. మహోత్సాహంతో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వాన్ని సెల్ఫ్ డిఫెన్సులో పడేశాం అనే భావనతోనే ఉన్నాయి.
అయితే ఈ భూదందాలను పురస్కరించుకుని.. జరిగిన భూ కొనుగోళ్ల మీద మొన్నటిదాకా న్యాయవిచారణ అంటూ వచ్చిన వైకాపా శ్రేణులు తాజాగా సీబీఐ విచారణను కూడా డిమాండ్ చేస్తున్నాయి. నిజానిజాల నిగ్గు తేల్చడానికి పార్టీలు సీబీఐ విచారణ కోరుతూ ఉండడం సహజమే అయితే.. ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. ‘సీబీఐ’ అనే పదం.. జగన్ ముందరికాళ్లకు బంధంలా మారేట్లు కనిపిస్తోంది.
భూ దందాల ఆరోపణలు మోస్తూ ఉన్న వారిలో కీలకమైన ఇద్దరు మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు తెలుగుదేశం పార్టీ తరఫున ఎదురుదాడుల బాధ్యతను తీసుకున్నట్లు స్పష్టమే. సాక్షి మీద న్యాయపరంగా పోరాడే ప్రక్రియను కూడా వారే ప్రారంభించారు. అదే సమయంలో వారు తాజాగా ప్రెస్‌మీట్ పెట్టి జగన్‌కు కొత్త సవాళ్లు విసిరారు. జగన్‌కు దమ్ముంటే.. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా.. తెదేపా మీద భూ కొనుగోళ్లకు సంబంధించి చేసిన ఆరోపణలు అన్నీ నిరూపించాలని వారు సవాలు విసురుతున్నారు.
సీబీఐ విషయానికి వస్తే- సీబీఐ విచారణ కోరే ముందు వైకాపా నాయకులు, జగన్ తమకు సీబీఐ మీద నమ్మకం ఉన్నదో లేదో ఓపెన్‌గా ప్రకటించాలని ఈ ఇద్దరు మంత్రులూ డిమాండ్ చేయడం విశేషం. జగన్‌కు సీబీఐ విచారణ మీద నమ్మకం ఉన్నట్లయితే గనుక.. జగన్ ఆస్తుల్లో అవినీతి సొమ్ముగా సీబీఐ చార్జిషీట్లో దాఖలు చేసినంత అవినీతి మొత్తాలను ఆయన ముందుగా ప్రభుత్వానికి చెల్లించేసి.. ఆ తర్వాత విచారణ గురించి డిమాండ్ చేయాలని మంత్రులు అంటున్నారు.
బినామీ పేర్లతో భూములు కొనే అవసరం తమకు లేదని, నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తామని, జగన్ ఆ పని చేయగలరా అని మూస విమర్శలు కూడా చేస్తున్నారు గానీ.. జగన్‌కు సీబీఐ మీద నమ్మకం ఉన్నదా? అనే ప్రశ్న వైకాపా మీదికి ఎదురుతిరిగిన సవాలు లాగా కనిపిస్తోంది.