ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తరచూ వినిపించే పదం.. నాడు – నేడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియా ప్రచారంపై మంచి పట్టు ఉంది. అందుకే.. సోషల్ మీడియాలో వచ్చే నాడు-నేడు ఫోటోలు..వీడియోల ద్వారా వచ్చే ఎఫెక్ట్ ఆయనకు బాగా తెలుసు. అందుకే.. గత ప్రభుత్వంలో లేని రంగులను వేసి.. కలర్ఫుల్గా మార్చి.. నాడు-నేడు అని ప్రచారం చేసుకునే వ్యూహాన్ని ఆయన మొదటి నుంచి పాటిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజలకు కళ్ల ముందు నాడు – నేడు కనిపిస్తోంది. విపత్తులు వచ్చినప్పుడు నాటి ప్రభుత్వం ఎలా స్పందించింది..నేటి ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది అనేది వాళ్లకు అనుభవం అవుతోంది.
విపత్తు నిర్వహణలో నాటి చురుకుదనం ఇప్పుడేది..?
అత్యధిక కోస్తా తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సహజంగానే ప్రకృతి వైపరీత్యాల గండం ఎక్కువ. ప్రతీ ఏటా.. రాష్ట్రంలో ఏదో ఓ ప్రాంతంలో తుపాన్లు వస్తూంటాయి. ఇలాంటిసమయంలో ప్రభుత్వాల అప్రమత్తత ప్రజల ఆస్తులను ప్రాణాలను కాపాడుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఉత్తరాంధ్రలో హుదూద్, తీత్లీతో పాటు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కూడా తుపాన్లు గడగడలాడించాయి. అలాంటి ప్రకృతి ప్రకోపం వస్తున్నప్పుడు.. చాలా మందుగానే ప్రభుత్వం అప్రమత్తమయ్యేది. వీలైనంతగా ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించడానికి ప్రయత్నించారు. అధికార యంత్రాంగం అంతా పరుగులు పెట్టేవారు. ఈ కారణంగానే హుదూద్ వంటి బీభత్సం జరిగినా.. విశాఖ శరవేగంగా కోలుకుంది. తీత్లీ తుపాను సిక్కోలు ప్రజలు అతలాకుతలమైనా… తేరుకున్నారు.
బాధితుల్ని అలా గాలికొదిలేయడం ఎప్పుడూ లేదే..?
అయితే.. ప్రస్తుతం ఆ మెకానిజం.. ఏపీలో కనిపించడం లేదు. వరదలు వచ్చే వరకూ నింపాదిగా ఉంటున్నారు. వర్షాలు దంచి కొట్టే వరకూ కదలకడం లేదు. ఆస్తి నష్టం గురించి పట్టింపే లేదు. వరద వచ్చిన తర్వాత బాధితుల్ని ఆదుకునే ప్రక్రియ కూడా సాగడంలేదు. గతంలో ప్రకృతి వలన నష్టపోయిన ప్రజల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం… వెంటనే అంచనాలు రూపొందించి.. నగదు బదిలీ చేసేసింది. హుదూద్ వచ్చినప్పుడు .. తీత్లీ వచ్చినప్పుడు వారం రోజుల్లోనే ఈ పంపిణీ జరిగింది. కానీ ప్రస్తుతం.. పంట నష్టం అంచనాలను కూడా అధికారులు సిద్దం చేయలేదు. ఆ దిశగా వారం తర్వాత జగన్ ఆదేశించారు. అసలు ఎంత పరిహారం ఇస్తారో ఇంత వరకూ ప్రకటన చేయలేదు. నాలుగు జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయినా… ప్రభుత్వ స్పందన మాత్రం లేదు.
పరిహారం విషయంలో జగన్ నాడేమన్నారు.. నేడు ఎంతిచ్చారు..?
విపత్తులు వచ్చినప్పుడు… నాటి ప్రభుత్వాన్ని..నేటి ప్రభుత్వాన్ని అంచనా వేసుకుంటున్న ప్రజలు.. నాడు- నేడు అని నిట్టూర్చే పరిస్థితి ఏర్పడింది. వరదలు వచ్చినప్పుడు.. గత ప్రభుత్వం ఎంత సాయం చేసినా విపక్ష నేతగా జగన్ మాత్రం… అది సరిపోదని వాదించేవారు. ప్రతిపక్ష నేతగా అది ఆయన బాధ్యత. కుటుంబానికి ఐదు వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు ఆయన ఐదు వందలు… కేజీ రూపాయికి చొప్పున ఇచ్చే రేషన్ బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలని ఆదేశించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూ. ఐదువేలన్న డిమాండ్.. ఇప్పుడు ఐదు వందలకు ఎందుకు పడిపోయిదంన్న చర్చ సహజంగానే ప్రజల్లో వస్తుంది. జగన్ పాతమాటలన్నీ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక్కడా.. నాడు – నేడు అని పోల్చుకుని ప్రజలు పెదవులు బిగబట్టడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు.