విశాఖలో మోదీని కాకాపట్టడానికి జగన్ చాలా ప్రయత్నాలు చేశారు. మాట కంటే ముందు.. తర్వాత సర్.. సర్ అంటూ.. విధేయత ప్రదర్శించారు. అదే ప్రసంగంలో మోదీతో తమ అనుబంధం రాజకీయాలకు అతీతమైనందని.. చెప్పుకున్నారు. మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో ఎజెండా లేదు. ఉండదు, ఉండబోదని ఖరాఖండిగా చెప్పారు. ఇంతకూ జగన్ అనుకునే ఆ మరో అజెండా ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రధాని మోదీ ముందు ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సీఎం జగన్ చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్తో జగన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజకీయ సంబంధాల ప్రకారం టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ సహకరించుకుంటూ ఉంటాయని చెబుతూంటారు. ఇటీవల గంగుల కమలాకర్ లాంటి మంత్రులు మీడియాతో మాట్లాడినప్పుడు… జగన్ కూడా కేసీఆర్ వెంట నడుస్తారని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో వైఎస్ఆర్సీపీతో కలుస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ స్థాయిలో కూడా అదే ప్రచారం జరుగుతోంది.
అందుకే ఈ విషయంలో సీఎం జగన్.. ప్రధాని మోదీకి క్లారిటీ ఇవ్వాలనుకున్నారని.. అందుకే తమకు మరో ఎజెండా లేదని .. తాము జాతీయ రాజకీయాల వైపు రానే రామని మోదీకి జగన్ సభా వేదికగా క్లారిటీ ఇచ్చారన్న అభిప్రాయం వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీతో కనీసం చిన్న వివాదం పెట్టుకునేందుకు కూడా జగన్ సిద్దంగా లేదు. అందుకే పోలవరం నిధులు, విభజన హామీైలు.. ఇతర అంశాల్లో గత ప్రభుత్వం కేంద్రంపై పోరాడినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి చేయడం లేదు. టీఆర్ఎస్ పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తూండటంతో ఆ పార్టీతో దగ్గరి సంబంధాలున్న వైఎస్ఆర్సీపీ వైపు అనుమానంగా చూడాల్సి వస్తోంది. ఈ కారణంగానే జగన్ మరో ఎజెండా ఉండదని చెప్పినట్లుగా భావిస్తున్నారు.