ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ద్రవ్యవినిమయ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయడం “తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు” అనే జగన్మోహన రెడ్డి వైఖరిని మరోసారి బయట పెడుతోంది.
జగన్ పార్టీ వ్యతిరేకించినా కూడా బిల్లు గెలుస్తుంది. ఈ విషయం ఆయనకీ తెలుసు. తన పార్టీ వదలిపోయిన ఎమ్మెల్యేల పదవులను విప్ ధిక్కార నేరం కింద ఊడగొట్టించాలన్నదే జగన్ ఆలోచన అని అందరికీ తెలుసు. వారిపై స్పీకర్ అనర్హత వేటు వేయరు. అది కూడా జగన్ కు తెలుసు. సుప్రీంకోర్టువరకైనా వ్యవహారాన్ని సాగదీసి ఫిరాయింపు ఎమ్మెల్యేల పై చర్యతీసుకునేలా చేయాలన్నదే ఆయన లక్ష్యం! ఇందుకు ఆయన కు వున్న హక్కుని ఎవరూ తొలగించలేరు. సొంతపార్టీవారు ఎందుకు దూరమౌతున్నారు? ఆ స్ధితిని ఎలా నివారించాలి అనే విషయాన్ని పక్కనపెట్టేసి చట్టసభాకాలాన్ని సొంత పంతాలకోసం వృధా చేయడం బాధ్యతా రాహిత్యమే!
పార్టీ అధినేతగా జగన్ కి ఉన్న అధికారాలను ఎవరూ తప్పుపట్టలేరు. బాధ్యతను మరచి కేవలం అధికారాన్నే ప్రయోగించే ఈ ప్రతిపక్ష నాయకుడి తీరు ప్రజల్లో ఒక విధమైన విముఖతను పెంచుతోంది.
ద్రవ్యవినిమయ బిల్లు గెలవకపోతే ప్రభుత్వం ఏవిధమైన ఖర్చూ చేయకూడదు. ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు కూడా నిలచిపోతూంది. మెజారిటీ మద్దతుతో పాలన సాగించే ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్ష బాధ్యత, అధికారం కూడా! ప్రభుత్వ కార్యకలాపాలు నచ్చకపోతే ప్రతిపక్షం విమర్శించవచ్చు. అయితే మెజారిటీ ప్రజల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వం రూపొందించుకున్న ప్రజోపయోగ కార్యక్రమాలకు, వాటిని అమలు చేసే ప్రభుత్వ యంత్రాంగానికీ డబ్బే ఆపెయ్యాలనే దశకు విప్ జారీ చేయడం ప్రజలపట్ల బాధ్యతా రాహిత్యమే అవుతుంది.
”ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేయలేను కాబట్టే వైదొలుగున్నా” అని ఆపార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రాసిన రాజీనామ లేఖ జగన్ ధోరణికి ఒక ఉదాహరణ!
శాసనసభలో, సభ బయట వ్యవహరించవలసిన తీరులో జగన్ కు తేడాలు తెలియడంలేదు. వ్యతిరేకించడం, నిరాకరించడం, విమర్శించడం, ఖండించడం, నిరసన తెలియజేయడం, ఆందోళనకు దిగడం, ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోవడం..వీటి మధ్య తేడాలను జగన్ గుర్తించడం లేదు. అసలు తేడా వుందని ఆయన నమ్ముతున్నట్టే లేదు.
తన వస్తువేదో బాబు ఎత్తుకుపోయారన్న ఆక్రోశాన్ని తలపిస్తూ సమయం సందర్భం లేకుండా అవకాశమొచ్చిన ప్రతీ సారీ చంద్రబాబు మీద విరుచుకు పడిపోవడం వల్ల జగన్ ఏం సాధించారో ఆయనకే తెలియాలి. ముఖ్యమంత్రిని విమర్శించే ప్రతిపక్ష ఏకసూత్రం సరే! తన పార్టీ ఎమ్మెల్యేలు వున్న నియోజకవర్గాల్లో గాని, తెలుగుదేశం ఎమ్మెల్యేలు వున్న నియోజకవర్గాల్లోగాని పార్టీ నిర్మాణంమీద, కమిటీ ల ఏర్పాట్ల మీదా రెండేళ్ళయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టే పెట్టలేదు. పార్టీ యంత్రాంగం లేకుండా చంద్రబాబు పై విరుచుకు పడటమే, శాసనసభను స్ధంభింపజేయడమే కార్యక్రమాలైతే వచ్చే ఎన్నికలు జగన్ పార్టీకి గడ్డు కాలమే అవుతుంది.