పాదయాత్ర 3వ రోజు ప్రారంభంలోనే వైఎస్ జగన్ వాగ్భాణాలు సంధించారు. సవాళ్లతో వేడి పుట్టించారు. పాదయాత్రలో భాగంగా బుధవారం వి.ఎస్.పల్లి గ్రామంలో ప్రసంగిస్తున్న సందర్భంగా ఆయన చంద్రబాబు అండ్ కోపై విరుచుకుపడ్డారు. తనపైన ఆరోపణలు గుప్పించడం కాదని దమ్ముంటే నిరూపించాలంటూ సవాల్ చేశారు.
ఇంతకీ వైఎస్ జగన్ అంత ఆగ్రహం ప్రకటించడానికి కారణం పాదయాత్ర ప్రారంభం అయిన మరుసటి రోజే బయటకి వచ్చిన పారడైజ్ పేపర్స్ వ్యవహారం. దేశవ్యాప్తంగా కొందరరు సంపన్నుల పేర్లు ఈ పేపర్స్‌లో వెలుగు చూడడం, అందులో వైఎస్ జగన్ పేరు కూడా ఉండడం. దీంతో సహజంగానే తెలుగుదేశం పార్టీ నేతలు దీనిని అవకాశంగా మలచుకుని జగన్‌పై విమర్శలు గుప్పించారు. వీటికి సమాధానం ఇచ్చే క్రమంలో వైఎస్ జగన్ బుధవారం సవాల్ చేస్తూ మాట్టాడారు.
తనకు విదేశాల్లో ఒక్క రూపాయి అయినా ఉన్నట్టు నిరూపించాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు.. అలా నిరూపించేందుకు తాను 15 రోజుల సమయం ఇస్తున్నానన్నారు. ఈ వ్యవధి లోపు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు వైఎస్ జగన్. అలా చేయని పక్షంతో చంద్రబాబు సిఎం పదవి నుంచి తప్పుకోవాలన్నారు.
తను ఏ కార్యక్రమం తలపెట్టినా దాన్ని విఫలం చేయడానికి, అడ్డుకోవడానికి చంద్రబాబు ఇలాంటివి ఏవో ఒకటి సృష్టిస్తూ ఉంటారని ఆరోపించారు. దీని కోసం మీడియాను వాడుకుంటారన్నారు. రూ.20, రూ.40 కోట్లు ఇచ్చి తమ ఎమ్మెల్యేలను సంత పశువుల్లా కొనడానికి అంత నల్లడబ్బు చంద్రబాబుకు ఎక్కడ నుంచి వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నంద్యాల ఎన్నికల్లో సైతం రూ. వందల కోట్లు వెదజల్లి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారన్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు మాత్రమే చంద్రబాబు నైజం అని ఎద్దేవా చేశారు. తానలా కాదని, చెప్పింది చేస్తా, చేసేదే చెబుతా అన్నారు.