వర్షాకాలం ఎవరైనా బుద్ది ఉన్న వాడు రోడ్లు వేస్తారా అని.. గత రెండేళ్లుగా వర్షాకాలంలో సీఎం జగన్ చెబుతూ వచ్చారు. వర్షాలు ముగియగానే పూర్తి చేసి..మళ్లీ వర్షాకాలం వచ్చేసరికి మిలమిలలాడే రోడ్లు తయారు చేయాలని ఆదేశించేవారు. అయితే ఇప్పుడు వర్షా కాలం ప్రారంభం కాగానే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి .. రోడ్ల దుస్థితికి.. పనులు చేయలేకపోవడానికి కారణం అనే వాదనను వినిపించడానికి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. రోడ్లపై సమీక్షలో గత మూడేళ్లుగా ఆయన అధికారులకు శరవేగంగా పనులు చేయాలని ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు.
మూడేళ్లుగా పెట్రోల్ , డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున రోడ్లను బాగు చేయడానికి అని చెప్పి సెస్‌లు వసూలు చేస్తూనే ఉన్నారు కానీ ఇంత వరకూ ఒక్క రోడ్డు బాగు చేసిన పాపాన పోలేదు సరి కదా.. ఇప్పుడు అప్పులు రాకుండా.. విపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. సమీక్షలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. పనులు చేయలేకపోవడానికి అప్పులు పుట్టుకపోవడమే కారణం అని.. ఆ అప్పులు రాకుండా విపక్షాలు అడ్డుకున్నాయని ఆయన చెబుతున్నారు.
“అభివృద్ధి పనులు ముందుకు సాగనీయకుండా రకరకాల కుట్రలు పన్నుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని, కేసుల ద్వారా అడ్డుకోవాలని, తద్వారా అభివృద్ధి పనులు ఆగిపోవాలని ప్రతిపక్షాలు ఒక అజెండాతో పనిచేస్తున్నాయని ” సీఎం చెప్పుకొచ్చారు. అయినా సడలని సంకల్పంతో అడుగులు వేస్తూ .పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జులై 15 కల్లా గుంతలు పూడ్చాలి, జులై 20 న ఫొటో గ్యాలరీలు పెట్టాలని ఆదేశించారు. ఇలాంటి ఆదేశాలు గత మూడేళ్లుగా ఇస్తూనే ఉన్నారు కాబట్టి… అధికారులు కూడా అదే విధంగా తలలూపారు.