చంద్రన్న కానుక, రంజాన్ తోఫా, ఏపీ ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరిగాయని మంత్రివర్గానికి మంత్రివర్గ ఉపసంఘం నివేది ఇచ్చింది. అర్హత లేని సంస్థలకు కట్టబెట్టారని.. సెటాప్ బాక్సుల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని మంత్రివర్గ ఉపసంఘం నిర్ధారించింది. ఫైబర్ నెట్లో సుమారు రూ.700 కోట్ల మేర అవినీతి జరిగిందని తేల్చారు. చంద్రన్న తోఫా, కానుక వంటి స్కీంల ద్వారా రూ.158 కోట్ల అవినీతి జరిగిందని.. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల ద్వారా ఏడాదికి రూ.40 కోట్లు ఖర్చు చేశారని.. ఉపసంఘం నివేదిక ఇచ్చింది. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల సరఫరా, ఖర్చులపైనా అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ నివేదికను సీరియస్‌గా పరిశీలించిన కేబినెట్…సీబీఐ విచారణకు సిఫారసు చేయాలని నిర్ణయం తీసుకుంది.
అవినీతికి ఆధారాలు దొరికితే.. తక్షణం కేసులు నమోదు చేసి.. వెంటనే బాధ్యుల్ని అరెస్ట్ చేయాల్సింది పోయి.. ఏపీ సర్కార్ అనూహ్యంగా సీబీఐ విచారణ కు సిఫార్సు చేయాలని నిర్ణయించడం. ఇప్పటికే.. పలు కేసుల్ని ఏపీ ప్రభుత్వం సీబీఐకి రిఫర్ చేసింది. రాజధాని భూముల్లో అక్రమాలపై విచారణ చేయాలంటూ.. ఏపీ సర్కార్ సీబీఐకి రిఫర్ చేస్తూ ఆదేశాలిచ్చింది. అయితే.. సీఐడీ ఇప్పటికీ విచారణ కొనసాగిస్తోంది. ఓ డిప్యూటీ కలెక్టర్ ను.. మరో కంప్యూటర్ ఆపరేటర్‌ను అరెస్ట్ చేశారు. దాంతో సీబీఐ విచారణ సంగతి ఏమయిందో తేలలేదు. అదే సమయంలో.. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ అక్రమాలపై కూడా విచారణకు సీబీఐకి సిఫార్సు చేశారు. ఇక హైకోర్టు కూడా.. పలు కేసులను సీబీఐకి రిఫర్ చేసింది. అయేషా మీరా కేసు..గుంటూరులో యువకులను పోలీసులు అక్రమ నిర్బంధం చేసిన ఘటన.. వివేకా హత్య కేసు… డాక్టర్ సుధాకర్ అంశంపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.
ఏపీ సర్కార్‌కు.. సొంత విచారణ సంస్థలు ఉన్నాయి. ఆధారాలు ఉంటే.. తక్షణం కేసులు నమోదు చేసి.. చర్యలు తీసుకోవచ్చు. కేబినెట్ సబ్ కమిటీ… అంత కచ్చితంగా అవినీతి జరిగిందని తేల్చినప్పుడు మరి ఇంకా.. సీబీఐ విచారణకు ఎందుకు సిఫార్సు చేయాల్సి వస్తుందో.. సామాన్యులకు అంతుబట్టని విషయం. ఏదో అవినీతి జరిగిందని ప్రచారంచేయడానికి ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారు తప్ప… అవినీతికి సాక్ష్యాలు ఉంటే.. ఇప్పటి వరకూ ఎందుకు ఊరుకుంటారన్న చర్చ ఇతర పార్టీల్లో నడుస్తోంది.